డికె, కొండా సొంతగూటికి ఎప్పుడు?

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తక్షణం అధికారంలోకి వచ్చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలను నమ్మడం కాదు కదా.. కనీసం గట్టిపోటీ ఇవ్వగల పార్టీ కింద గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకం అటు…

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తక్షణం అధికారంలోకి వచ్చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలను నమ్మడం కాదు కదా.. కనీసం గట్టిపోటీ ఇవ్వగల పార్టీ కింద గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకం అటు ఆ పార్టీ నాయకుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ కూడా ఎన్నడో సన్నగిల్లిపోయింది. ఈ నేపథ్యంలో.. భారాస నుంచి కీలకమైన నాయకులు కాంగ్రెసులోకి వలస వెళుతున్నారు. 

ఏపార్టీలో ఉన్నామనేది తమ ప్రాధాన్యం అసలు కానే కాకుండా.. కేసీఆర్ వ్యతిరేకత ఒక్కటే ఎజెండాగా ఉండే నాయకులకు ఇప్పుడు భాజపాలో కొనసాగడం కంటె.. కాంగ్రెసు పార్టీలో చేరడం అత్యుత్తమ ఆప్షన్ కింద కనిపిస్తోంది. అందుకే అందరూ క్యూ కడుతున్నారు. అంతా బాగానే ఉంది. కొన్ని వారాలుగా ఫిరాయిస్తారనే పుకారు వార్తల్లో కీలకంగా ఉన్న డికె అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నాయకులు ఎప్పుడు వెళ్లబోతున్నారు?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ భాజపాలో ఉన్నంత కాలం కీలక నాయకులుగానే చెలామణీ అయ్యారు. భాజపాలోకి వెళ్లినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ గొప్పదనం గురించి చాలానే కబుర్లు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా కూడా పువ్వు గుర్తు మీద ఓడిపోయినప్పుడే ఆయనకు కనులు తెరచుకోవడం మొదలైనట్టు కనిపిస్తోంది. 

అప్పటినుంచి అంటీముట్టనట్టుగానే ఉంటూ.. తనకు పార్టీలో విలువ తగ్గకుండా జాగ్రత్త తీసుకున్న రాజగోపాల్ రెడ్డి.. చివరి నిమిషంలో కాంగ్రెసులోకి ఫిరాయించి టక్కున టికెట్ దక్కించుకున్నారు. ఆయనతోపాటు, వివేక్ జంపింగ్ గురించి కూడా తొలినుంచి పుకార్లు వినిపిస్తూనే వచ్చాయి. వివేక్ వాటిని ఖండిస్తూనే వచ్చారు. అయితే.. చివరికి జాబితాల ప్రకటన కూడా పూర్తయిన తర్వాత.. వివేక్ కూడా ఫిరాయించారు. వివేక్ కు ఎంపీ పదవే ప్రధానం కాబట్టి.. ఆయన ఫిరాయింపు కాస్త  లేటైనా నష్టం లేదు.

ఇక ఇదేస్థాయిలో ఫిరాయిస్తారనే పుకార్లను ఎదుర్కొంటున్న వారిలో డికె అరుణ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఉన్నారు. డికె అరుణకు ఆల్రెడీ భాజపా ఎమ్మెల్యే టికెట్ ప్రకటించింది. అయితే ఆమె ఇంకా అక్కడ కొనసాగే ఉద్దేశంతో ఉన్నారా ? ఆలోచిస్తున్నారా? అనేది తెలియదు. డికె అరుణకు సంబంధించినంత వరకు ఆమె బిజెపి నుంచి గెలిచినా సరే.. కాంగ్రెస్ రాష్ట్రంలో సింపుల్ మెజారిటీ సాధిస్తే.. కాంగ్రెసు నుంచి రెడ్ కార్పెట్ ఆహ్వానం ఉండనే ఉంటుంది. 

ఇక మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి .. తిరిగి ఎప్పుడు కాంగ్రెసులోకి వెళ్తారనేది వేచి చూడాలి. ఆయనకు కూడా ఎంపీ సీటే ప్రధానం కాబట్టి.. ఈ ఎన్నికల తర్వాత.. తేలబోయే బలాబలాలను బట్టి ఆయన ఫిరాయింపు ఉంటుందని.. ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉంటారని పలువురు అంచనా వేస్తున్నారు.