‘కృతజ్ఞత’ దాటి ‘సమర్థత’ వైపు వచ్చేదెప్పుడు?

కన్నడదేశానికి ఉప ముఖ్యమంత్రి, అక్కడ ఎన్నికల్లో ఎంతో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పిన అప్పటి పీసీసీ సారథి డికె శివకుమార్ వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన తెలంగాణలో ఎన్ని ఓట్లను  ప్రభావితం చేయగలరు? ఆ…

కన్నడదేశానికి ఉప ముఖ్యమంత్రి, అక్కడ ఎన్నికల్లో ఎంతో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పిన అప్పటి పీసీసీ సారథి డికె శివకుమార్ వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన తెలంగాణలో ఎన్ని ఓట్లను  ప్రభావితం చేయగలరు? ఆ ప్రశ్నకు జవాబు కష్టం గానీ.. ఆయన కోసం, అంటే ఆయనను పిలిచి పెద్దపీట వేసి ఆయనతో ప్రచారం చేయించుకోవడం కోసం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బహుధా ఎగబడడం చాలా సహజం. 

పార్టీలో ఆయన ప్రాధాన్యం అలాంటిది. సదరు శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార బస్సుయాత్రలో పాల్గొన్నారు. అనేకానేక ఎన్నికల హామీలను గుర్తుచేశారు గానీ.. తమ పార్టీ ఓటు వేయాల్సిన అవసరం గురించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు కృతజ్ఞత చూపాలని ఆయన కోరారు.

సరిగ్గా ఈ పాయింటు దగ్గరే ఇబ్బందిగా కనిపిస్తోంది. పదేళ్ల కిందట జరిగిన వ్యవహారానికి సంబంధించి.. ఇప్పుడు కృతజ్ఞత చూపాలని, రుణం తీర్చుకోవాలని కాంగ్రెసు తరఫున అభిలషించడం అనేది చిత్రంగా ఉంది. రాష్ట్రం ఇచ్చినది కాంగ్రెసు పార్టీనే అనే నమ్మకం రాష్ట్ర ప్రజల్లో ఏ కొంతైనా నిజంగా ఉండి ఉంటే గనుక, లేదా, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వారికి రుణపడి ఉండాలనే ఆలోచన వారికి ఉంటే గనుక.. ఈ పదేళ్లలో ఎప్పుడో ఒకప్పుడు కనిపించి ఉండేది. పదేళ్లుగా లేని నమ్మకం ప్రజలకు ఇప్పుడు హఠాత్తుగా రమ్మంటే వస్తుందా? అనేది ప్రశ్న!

అయినా కాంగ్రెస్ నాయకులు.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు తమకు ప్రజలు రుణపడి ఉండాలనే భావజాలం నుంచి బయటకు రావాలి. ఇంకా కృతజ్ఞత పదం చెప్పి ఓట్లు అడుక్కునే వైఖరిలోనే ఉంటే.. ఇక ‘సమర్థత’ పేరు చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఎప్పటికి వస్తుంది. ఏ రకంగా చూసినా తమ పార్టీ గొప్ప పాలన అందిస్తుందని చెప్పి ప్రజలను నమ్మించగలగాలి. 

కాంగ్రెసు జాతీయ పార్టీ గనుక.. వారినుంచి ప్రజలు ఆశించే హామీలు ఆ స్థాయిలోనే ఉంటాయి. డికె శివకుమార్.. కర్ణాటకలో తాము ఇచ్చిన అయిదు హామీలను చక్కగా అమలు చేస్తున్నామని చెప్పినట్టే.. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల అమలు కూడా జరుగుతుందని చెప్పగలగాలి. 

అలాగే.. హిమాచల్ లోని వారి పార్టీ సీఎం తెలంగాణ ప్రజలకు వరమిచ్చినట్టుగా కాంగ్రెస్ నెగ్గితే.. పాత పెన్షను విధానం కూడా అమల్లోకి తెస్తామని చెప్పగలగాలి. ఆ రకంగా తమ సమర్థతను, చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా.. ఇంకా కృతజ్ఞతతో  ఓట్లు వేయమని బతిమాలుతూ ఉంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ ఎప్పటికీ నెగ్గకపోవచ్చు.