ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రెండో దఫా ఈడీ విచారణకు సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత వెళ్లడంపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు ఆమె హాజరు కావాల్సి వుంది. కానీ నిర్దేశిత సమయం దాటి 30 నిమిషాలు అయినా కవిత మాత్రం కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రాకపోవడం సర్వత్రా టెన్షన్ నెలకుంది. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో ఆమె చర్చిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా వుండగా ఈడీ విచారణకు ముందు కవిత మీడియాతో మాట్లాడ్తారని పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే 11 గంటల సమయం గడిచిపోయినా ఆమె ఇంటి నుంచి బయటకు రాకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. మరొక రోజు విచారణకు వస్తాననే సమాచారాన్ని తన ప్రతినిధుల ద్వారా ఈడీ అధికారులకు పంపినట్టు తాజా వార్త.
దీనిపై ఈడీ అధికారుల స్పందన తెలియాల్సి వుంది. ఈడీ విచారణ కోసమే ఢిల్లీకి వెళ్లిన కవిత… చివరి నిమిషంలో నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారనేది తెలియాల్సి వుంది. ఎందుకంటే విచారణకు గైర్హాజరు కావడానికి బలమైన కారణాన్ని ఈడీకి తెలియజేయాల్సి వుంటుంది. అది ఈడీ అధికారులను ఒప్పించేలా ఉండాలి.
ఈడీ విచారణకు కవిత వెళ్లకపోవడంపై క్షణంక్షణం రకరకాల ప్రచారానికి దారి తీస్తోంది. అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆమె విచారణకు వెళ్లడం లేదని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసలేం జరుగుతున్నదో కవిత నోరు తెరిస్తే తప్ప వాస్తవాలు తెలిసే అవకాశం లేదు.