తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. చర్చలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి హాఫ్ నాలెడ్జ్ మినిస్టర్‌గా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్‌రావు ఘాటు విమర్శ చేశారు. దీంతో మంత్రి కోటమిరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేటాయింపులపై కోమటిరెడ్డి సరిగా అర్థం చేసుకోలేదని హరీష్‌రావు అన్నారు. భట్టి విక్రమార్క బడ్జెట్‌లో మాయ చేశారని మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని తనదైన స్టైల్‌లో హరీష్‌రావు చురకలు అంటించారు.
హరీష్ తనను కించపరిచేలా మాట్లాడ్డంపై కోమటిరెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. హరీష్‌రావుకే సబ్జెక్ట్ లేదని కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. హరీష్‌రావు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వుందని విమర్శించారు. అబద్ధాలు, గారడీలు, మోసాలు, కుట్రలకు బీఆర్ఎస్ కేంద్రమని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. గతంలో టీఆర్ఎస్‌ను స్థాపించే సందర్భంలోనూ, అలాగే 2014 ఎన్నికల సందర్భంలోనూ తన పార్టీని ఆదరిస్తే దళితుడిని సీఎంగా చేస్తానని మీ మామ హామీ ఇచ్చారా? లేదా? అని హరీష్‌రావును నిలదీశారు.
ఇదిలా వుండగా మంత్రిని ఉద్దేశించి హాఫ్ నాలెడ్జ్ అంటూ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని హరీష్‌రావును స్పీకర్ కోరారు. అయితే తన వ్యాఖ్యలపై అభ్యంతరం వుంటే తొలగించాలని స్పీకర్‌కే వదిలేశారు.