కోమటిరెడ్డి బ్రదర్​కు మంత్రి పదవి కష్టమేనా?

ఒకవేళ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాత్రం అది పార్టీలో వివాదానికి దారి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కేబినెట్​ విస్తరణ హడావిడి మొదలైంది. ఉగాదికి విస్తరణ ఉంటుందని అంటున్నారు కాబట్టి ఎవరెవరి పేర్లో బయటకు వస్తున్నాయి. కేబినెట్​లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా, నాలుగు భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనారిటీ సామాజికవర్గాల నుంచి పదవులు ఇవ్వాలని డిసైడ్​ అయ్యారు. మిగిలిన సామాజికవర్గాల సంగతి అలా ఉంచితే ప్రస్తుతం రెడ్డి సామాజికర్గం పదవే వివాదాస్పదమయ్యేలా ఉంది.

మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్​లో ఒకడైన కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి, సుదర్శన్​ రెడ్డి, రామ్మోహన్​ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే వీరిలో రాజగోపాల్​ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఆయనకు మంత్రి పదవి వచ్చినట్లే భావించి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయన కూడా తనకు మంత్రి పదవి వచ్చినట్లే ఫీలవుతున్నారు. తనకు హోం శాఖ ఇష్టమని, కాబట్టి తనకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. రాజగోపాల్​ రెడ్డికి కోరిక ఉండటంలో తప్పలేదు. కాని ఆయనకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో ఒక చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉంది.

ఒకవేళ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాత్రం అది పార్టీలో వివాదానికి దారి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఆల్రెడీ ఆయన అన్నయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే పార్టీలో నిరసన వ్యక్తమవుతుందన్న అభిప్రాయం ఉంది. పైగా ఇద్దరూ నల్గొండ జిల్లాకు చెందినవారే. కేబినెట్​లో కొన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం లేదు. అలాంటప్పుడు ఒకే జిల్లాకు చెందిన ఇద్దరికి మంత్రి పదవులంటే అభ్యంతరం వస్తుందని అంటున్నారు.

అయితే కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజగోపాల్​ రెడ్డి మంత్రి పదవి మీద ఆశలు పెట్టున్నారు. భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం అండ్​ రేవంత్​ రెడ్డి హామీ ఇచ్చారట. ఆ హామీ ప్రకారం తనకు మంత్రి ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. మరి చివరి క్షణంలో సమీకరణాలు మారితే ఆయనకు మంత్రి పదవి దక్కదు. కాని ఆయన మాత్రం ఆశ వీడకపోగా తనకు ఏం పదవి కావాలో మనసులో కోరిక బయటపెట్టారు.

తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆల్రెడీ రంగారెడ్డి వార్నింగ్​ ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములకు, ఒకే జిల్లాకు చెందిన అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే కేవలం రెడ్డి సామాజికవర్గమే కాకుండా ఇతర సామాజికవర్గాలు కూడా వ్యతిరేకిస్తాయి. మరి అధిష్టానం, రేవంత్​ రెడ్డి ఈ సమస్యను ఎలా డీల్​ చేస్తారో చూడాలి.