మ‌రింత బ‌ల‌హీన‌ప‌డేందుకే… ఈ సోదాలు!

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ మ‌రింత బ‌ల‌హీనప‌డేందుకు త‌న‌కు తానుగా నెత్తిన చెయ్యి పెట్టుకుంటోంది. కాంగ్రెస్‌కు మ‌రింత ఊపు తెచ్చేలా కేంద్ర ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట…

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ మ‌రింత బ‌ల‌హీనప‌డేందుకు త‌న‌కు తానుగా నెత్తిన చెయ్యి పెట్టుకుంటోంది. కాంగ్రెస్‌కు మ‌రింత ఊపు తెచ్చేలా కేంద్ర ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట గురువారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయ‌కుల‌ వ్యాపార సంస్థ‌ల‌పై ఐటీ సోదాలు నిర్వ‌హించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  

ఈ చ‌ర్య‌లు బీజేపీని రాజ‌కీయంగా ఇర‌కాటంలోకి నెట్ట‌డంతో పాటు మ‌రింత బ‌ల‌హీన‌ప‌రిచేలా చేస్తున్నాయనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కాంగ్రెస్ నాయ‌కురాలు, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తోడ‌ల్లుడైన రియ‌ల్ట‌ర్‌ గిరిధ‌ర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇళ్ల‌లో ఐటీ సోదాలు జరిగాయి.

కోకాపేటలోని ఈడెన్‌ గార్డెన్‌లో గిరిధర్‌రెడ్డికి సంబంధించి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ త‌నిఖీలు సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో బ్యాంక్‌ అధికారుల సమక్షంలో జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ సోదాల‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఎన్నిక‌ల్లో భ‌య‌పెట్టి లొంగ‌దీసుకునేందుకు బీజేపీ ఈ ఎత్తుగ‌డ‌లు వేస్తోంద‌ని ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లిగించేందుకే బీజేపీ ప్ర‌భుత్వం ఐటీని ఉసిగొల్పింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా వుండ‌గా  ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల ఇళ్లు, కార్యాల‌యాల్లోనే ఎక్కువ‌గా సోదాలు చేస్తుండ‌డంతో బీఆర్ఎస్‌, బీజేపీని జ‌మ‌క‌ట్టి విమ‌ర్శించేందుకు ఆ పార్టీకి ఆయుధం చిక్కిన‌ట్టైంది. ఇలాంటి చ‌ర్య‌లు ముఖ్యంగా బీజేపీని ప్ర‌జ‌ల్లో చుల‌క‌న చేయ‌నున్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.