కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దినదినగండం నూరేళ్ళ ఆయుష్షు. ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో అనే ఆందోళన సీఎంకు తప్పనిసరిగా ఉంటుంది. ప్రభుత్వం ఎంతకాలం బతికి ఉంటుందనేది అధిష్టానం నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.
ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరు తిరుగుబాటు చేస్తారో తెలియదు. గులాబీ పార్టీ నాయకులు అప్పుడప్పుడు ఫలానా మంత్రులవల్ల రేవంత్ ప్రభుత్వానికి ముప్పుంది అని చెబుతుంటారు. అందుకు వారి దగ్గర ఉన్న ఆధారాలేమిటో తెలియదు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ కష్టమేనని సాక్షాత్తు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డే అన్నాడు. పార్టీ తీరును ఆయన తప్పుబడుతున్నారు. తనతో సహా కీలక నాయకులకు తెలియకుండా నామినేటెడ్ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
ఎప్పటినుంచో పార్టీ కోసం కష్టపడుతున్నవారికి పోస్టులు దక్కడంలేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షి రాష్ట్రంలో ఉన్నారా? వేరే రాష్ట్రానికి తరలిపోయారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులోనూ త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. దానికి సంబంధించి కూడా కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. అది కూడా జగ్గారెడ్డి మనసులో ఉండొచ్చు.
సొంత పార్టీపై జగ్గారెడ్డి చేసిన విమర్శలు కలకలం కలిగిస్తున్నాయి. పార్టీపై విమర్శలు చేయడం జగ్గారెడ్డికి కొత్త కాదు. సూటిగానే మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు స్వతంత్రం ఎక్కువ కాబట్టి అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోదు.