ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయంగా తన పార్టీ పేరుకు విరుద్ధంగా పూర్తిగా అశాంతితో రగిలిపోతున్నట్టు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగోలేదని తరచూ ఆయన వాపోతుంటారు. తనకు అధికారం అప్పగిస్తే లక్షల కోట్ల నిధులు తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాలను బంగారమయం చేస్తానని ఆయన భరోసా ఇస్తుంటారు. అయితే కేఏ పాల్‌కు అధికారం ఇస్తే, బతుకులు మారిపోతాయనే ఉద్దేశంతో కాబోలు… ప్రజలకు ఆయనకు ఒకే ఒక్క చాన్స్ ఇవ్వడం లేదు.
కేఏ పాల్ ఎప్పుడు ఎక్కడ వుంటారో ఆయనకే తెలియదు. ఇవాళ ఉన్నట్టుండి హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతానని భీష్మించారు. సీఎం అంటే ఆయన దృష్టిలో ఆప్ట్రాల్ …అంతే మరి! సీఎంను కలవాలంటే అపాయింట్‌మెంట్ ఉండాలని చెబితే, ఆయన వినిపించుకోలేదు.
ప్రగతి భవన్‌లో ఉన్న కేసీఆర్‌ను కలిసేందుకంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. కుదరదంటూ పోలీసులు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులతో కేఏ పాల్ గొడవకు దిగారు. తనను ప్రగతి భవన్‌లోకి అనుమతించని పోలీసులపై ఫైర్ అయ్యారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్ ఉండగా, తనను ఎందుకు అనుమతించరని పోలీసుల్ని నిలదీశారు.
అదే సమయంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ అయ్యారని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. పైగా తాను అఖిలేష్ కంటే గొప్ప నాయకుడిని అని, అలాంటి తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందే అని తెగేసి చెప్పారు. అఖిలేష్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులకు అపాయింట్‌మెంట్ ఇస్తున్న సీఎం తనతో మాట్లాడ్డానికి మాత్రం ఎందుకు ఇష్టపడరని నిలదీశారు. తెలంగాణ అప్పులు, అభివృద్ధిపై చర్చించాలని అనుకున్నప్పటికీ వీలు కాలేదని పాల్ మండిపడ్డారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఒక కామెడీ సీన్‌ను సృష్టించింది.