క‌మ్మ వాళ్ల‌కు రాజ‌కీయ అస్తిత్వ స‌మ‌స్య‌?

తెలంగాణ‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి రాజ‌కీయ అస్తిత్వ‌ స‌మ‌స్య ఏర్ప‌డింది. రాజ‌కీయంగా క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానంత‌రం రెడ్ల‌కు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చింది.…

తెలంగాణ‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి రాజ‌కీయ అస్తిత్వ‌ స‌మ‌స్య ఏర్ప‌డింది. రాజ‌కీయంగా క‌మ్మ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానంత‌రం రెడ్ల‌కు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చింది. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి కూడా కాంగ్రెస్‌లో చోటు వుండేది. అయితే రెడ్ల‌ను అధిగ‌మించేంత కాదు. దీంతో క‌మ్మ నేత‌లు క‌మ్యూనిస్టు పార్టీల్లో త‌మ అస్తిత్వాన్ని చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు.

1982లో టీడీపీ ఆవిర్భావంతో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి రాజ‌కీయాల్లో గ‌ట్టి ప‌ట్టు దొరికింది. అధికారం వారి చేత‌ల్లోకి వెళ్లింది. అప్ప‌టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం ఆ రెండు సామాజిక వ‌ర్గాల మధ్యే చేతులు మారేది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌, తెలంగాణ ఏర్పాటుతో రాజ‌కీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీలో అధికారం ఆ రెండు సామాజిక వ‌ర్గాల మధ్య అటూఇటూ మారింది.

కానీ తెలంగాణ‌లో మాత్రం వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన కేసీఆర్ చేత‌ల్లో వుంది. నిజానికి రెడ్ల పార్టీగా కాంగ్రెస్ గుర్తింపు పొందిన‌ప్ప‌టికీ, అత్య‌ధికంగా బీఆర్ఎస్‌లో ఆ సామాజిక వ‌ర్గం అధికారాన్ని అనుభ‌విస్తోంది. ఎంత‌గా అంటే బీఆర్ఎస్ అంటే రెడ్ల పార్టీ అనేంత‌గా. 2018లో 119 సీట్ల‌కు గాను 35, తాజాగా ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ జాబితాలో 40 మంది రెడ్ల నాయ‌కులు అసెంబ్లీ సీట్లు ద‌క్కించుకోవ‌డం మామూలు విష‌యం కాదు.

కేసీఆర్ సామాజిక వ‌ర్గానికి కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే ఇచ్చారు. క‌మ్మ సామాజిక వ‌ర్గం కేవ‌లం ఐదు సీట్ల‌తో బీఆర్ఎస్‌లో స‌రిపెట్టారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్‌పై క‌మ్మ నేత‌లు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టంతా కాంగ్రెస్‌పై ప‌డింది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ రేణుకా చౌద‌రి నేతృత్వంలో కొంద‌రు క‌మ్మ నాయ‌కులు ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌ను క‌లిసి, 10 నుంచి 12 ఎమ్మెల్యే సీట్లు త‌మ సామాజిక వ‌ర్గానికి ఇవ్వాల‌నే డిమాండ్ పెట్టారు.

తెలంగాణ‌లో సుమారు 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో తాము ప్ర‌భావాన్ని చూపుతామ‌ని, రాజ‌కీయంగా త‌గిన ప్రాధాన్యం ఇవ్వాల‌ని వారంతా కోరడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రోవైపు బీఆర్ఎస్ నుంచి ఎదురు దాడి మొద‌లైంది. కమ్మ వారంటే ఢిల్లీకి వ్య‌తిరేకంగా పోరాడిన ఘ‌న‌త సాధించుకున్నార‌నే వాద‌న తెర‌పైకి తెస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల సీట్ల కోసం ఢిల్లీ నేత‌ల కాళ్లావేళ్లా ప‌డ‌డం ఏంట‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

క‌మ్మ నేత‌ల ఆందోళ‌న అర్థం చేసుకోద‌గ్గ‌దే. రాజ‌కీయాల్లో కమ్మ వారికి త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోతే, రానున్న రోజుల్లో త‌మ ఉనికి నామ‌మాత్రం అవుతుంద‌నేది వారి ఆలోచ‌న‌, ఆవేద‌న‌. కేసీఆర్ చేతిలో అధికారం ఉన్న‌ప్ప‌టికీ, పెత్త‌నం అంతా రెడ్ల‌దే అన్న‌ట్టుగా తయారైంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రెడ్ల‌కే ప్రాధాన్యం ఇస్తే, ఇక త‌మ గ‌తేంటి అనేది కమ్మ నేత‌ల ప్ర‌శ్న‌. రానున్న ఎన్నిక‌ల్లో క‌మ్మ వారి మ‌ద్ద‌తు ఎటు వైపు? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.