చంద్రబాబు దెబ్బ: కాసాని రాజీనామా!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సర్వనాశనం అయిపోతే మాత్రం ఏమిటి.. తను ఆశించే ప్రయోజనాల నెరవేరితే చాలు.. అనేదే లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు సాక్షాత్తు ఆ…

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సర్వనాశనం అయిపోతే మాత్రం ఏమిటి.. తను ఆశించే ప్రయోజనాల నెరవేరితే చాలు.. అనేదే లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా కే దారి తీసింది. సారథ్యం అప్పగించారు కదా అని.. సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుంటూ.. పార్టీకి కాస్త జవసత్వాలు తీసుకువచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు పార్టీ నుంచి తప్పుకున్నారు. తన భవిష్య కార్యాచరణను ఆయన ప్రకటించబోతున్నారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంతగా పతనం అయిపోయి ఉన్నప్పటికీ.. పార్టీకి ఒక కార్యవర్గం, కార్యాలయం మాత్రం నడుస్తూ వచ్చాయి. గతంలో అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఎల్ రమణ భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత.. దిక్కు లేకుండా పోయిన పార్టీకి కొన్నాళ్లకు కాసాని జ్ఞానేశ్వర్ సారథి అయ్యారు. పార్టీకి ఒక ఊపు తీసుకువచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశ కలిగేలాగా పార్టీని నిర్మించారు.

చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత.. మారిన పరిస్థితుల నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ మార్గదర్శకత్వంలో కేవలం 85 స్థానాలలో మాత్రం తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత 119 స్థానాలలో కూడా బరిలోకి దిగుతామని, నెమ్మదిగా అయినా పార్టీకి పునర్ వైభవం తీసుకువస్తామని తేల్చి చెప్పారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలులో మూలాఖత్ లో చంద్రబాబు నాయుడు పోటీ వద్దని ఆదేశించినట్లు తర్వాత ప్రకటించారు.

తెలంగాణ పార్టీ కార్యవర్గ సమావేశంలోనే అనేక ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు పార్టీ పోటీ చేసి తీరాల్సిందే అని తీర్మానించినప్పటికీ.. కాసాని చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. పార్టీకి అతీగతి తీసుకురావడానికి తాను కష్టపడుతుంటే.. చంద్రబాబునాయుడు మోకాలు అడ్డుతున్న వైఖరి పట్ల కాసాని జ్ఞానేశ్వర్ కినుక వహించినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీకి తన రాజీనామా ప్రకటించారు. 

రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి మేలు చేయడానికి మాత్రమే తెలుగుదేశాన్ని పోటీ నుంచి తప్పించే నిర్ణయం చంద్రబాబు తీసుకున్నారని సర్వత్రా వినిపిస్తున్న వేళ.. కాసాని జ్ఞానేశ్వర్ భారాసలోకి వెళతారా, లేదా స్వతంత్రంగానే ఉంటారా అనేది లేచి చూడాల్సి ఉంది.