తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత ఈడీ విచారణ సినిమాను తలపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత రెండోసారి ఈడీ విచారణకు గురువారం హాజరు కావాల్సి వుంది. అయితే విచారణ సమయానికి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 గంటలకు విచారణ నిమిత్తం కవితకు బదులు ఈడీ కార్యాలయానికి ఆమె తరపు న్యాయవాది సోమా భరత్ వెళ్లారు. అనారోగ్య కారణాలతో పాటు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా తాను విచారణకు రాలేనని తన లాయర్ ద్వారా ఈడీకి కవిత ఓ లేఖ పంపారు.
అయితే కవిత విన్నపాన్ని ఈడీ తిరస్కరించినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు రావాల్సిందేనని ఈడీ తెల్చి చెప్పిందన్న సమాచారం రాజకీయంగా హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో కవిత, మంత్రులు కేటీఆర్, హరీష్రావు తదితర బీఆర్ఎస్ ముఖ్యులు చర్చిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఈడీ విచారణకు వెళ్లకపోతే ఏమవుతుందనే దిశగా చర్చలు నడుస్తున్నట్టు తెలిసింది.
ఇదిలా వుండగా కవిత విచారణకు రాలేని పక్షంలో తదుపరి ఎలాంటి చర్యలుంటాయనే కోణంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ ఈడీ విచారణకు వెళ్లే కవితను అరెస్ట్ చేస్తారనే వార్తలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు కవిత వెళ్లకపోవడం సహజంగానే రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఇటు కవిత, బీఆర్ఎస్ నేతలు, అటు ఈడీ ఒకరికి మించి మరొకరు ఎత్తుకు పైఎత్తుల్లో నిమగ్నమయ్యారు. చివరికి ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతం కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఉన్నాయి. కవితను అరెస్ట్ చేస్తే… తీవ్ర పరిణామాలు వుంటాయనే హెచ్చరికలు తెలంగాణలో బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్నాయి.