జ‌గ‌న్ స‌ర్కార్‌పై కేసీఆర్ కామెంట్…ఏమ‌న్నారంటే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రోజులు స‌మీపిస్తుండ‌డంతో బీఆర్ఎస్ వేగం పెంచింది. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న మొద‌లుకుని, బీ ఫారాలు అంద‌జేత‌, నేడు మ్యానిఫెస్టో ప్ర‌క‌ట‌న వ‌ర‌కూ సీఎం కేసీఆర్ ముందంజ‌లో ఉన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మ్యానిఫెస్టోను…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రోజులు స‌మీపిస్తుండ‌డంతో బీఆర్ఎస్ వేగం పెంచింది. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న మొద‌లుకుని, బీ ఫారాలు అంద‌జేత‌, నేడు మ్యానిఫెస్టో ప్ర‌క‌ట‌న వ‌ర‌కూ సీఎం కేసీఆర్ ముందంజ‌లో ఉన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మ్యానిఫెస్టోను కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పెన్ష‌న్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న తీరును ఆయ‌న ప్ర‌శంసించారు. మ్యానిపెస్టోలో పెన్ష‌న్‌దారుల‌కు పండుగ చేసుకునేలా ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేషం. ముందుగా జ‌గ‌న్ పాల‌న‌పై కేసీఆర్ ఏమ‌న్నారో తెలుసుకుందాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెన్ష‌న్ స్కీమ్ అమ‌లు చాలా అద్భుతంగా అమ‌ల‌వుతోంద‌న్నారు. ఈ మధ్యే జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూ.2 వేల పెన్ష‌న్‌ను రూ.3 వేల‌కు పెంచార‌ని ప్ర‌శంసించారు. ఇదే త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా పెన్ష‌న్‌ను పెంచుతామ‌ని చెప్పుకొచ్చారు.

ప్ర‌స్తుతం రూ. 2 వేలు ఉన్న పెన్ష‌న్‌ను రూ. 5 వేల‌కు పెంచుతామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఆసరా పెన్ష‌న్ల‌ను ఈ భ‌వ‌నంలోనే పుట్టిన నిర్ణ‌యమ‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఆసరా పెన్ష‌న్ల‌కు చాంపియ‌న్ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ప‌దులు, వంద‌ల రూపాయల్లో ఉన్న స్కీంను వేల రూపాయ‌ల‌కు తీసుకెళ్లామ‌న్నారు. ఈ క్ర‌మంలో ఆస‌రా పెన్ష‌న్ల‌ను రూ. 5 వేల‌కు పెంచుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే స‌డెన్‌గా మ‌రుస‌టి రోజే పెంచ‌మ‌ని నిజాయ‌తీగా చెబుతున్నామ‌న్నారు.

త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత …వ‌చ్చే ఏడాది మార్చి త‌ర్వాత రూ. 3 వేలు చేస్తామ‌ని, ప్ర‌తి ఏడాది రూ. 500 పెంచుకుంటూ.. ఐదో సంవ‌త్స‌రం నాటికి రూ. 5 వేలు చేస్తామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. ఈ పెంపువ‌ల్ల ప్ర‌భుత్వం మీద భారం ప‌డ‌ద‌ని కేసీఆర్ చెప్పారు. ఏపీ గ‌వ‌ర్న‌మెంట్‌లో కూడా ఈ స్కీంను విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నార‌ని కొనియాడారు.

దివ్యాంగుల పెన్ష‌న్‌ను ఇటీవ‌లే రూ. 4 వేలు చేసుకున్నామ‌న్నారు. దాన్నిఆరు వేల రూపాయ‌ల‌కు తీసుకెళ్తామ‌ని సీఎం కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల 35 వేల కుటుంబాల్లో దివ్యాంగులు ఉన్నార‌న్నారు. మార్చి త‌ర్వాత రూ. 5 వేల‌కు , ఆ త‌ర్వాత ప్ర‌తి ఏడాది రూ.300 చొప్పున‌ పెంచుకుంటూ.. ఐదో సంవ‌త్స‌రం నాటికి రూ. 6 వేలు చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీంతో పెన్ష‌న్‌దారులు, దివ్యాంగుల ఆనందానికి అవ‌ధుల్లేవు.