ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్ ఇరుక్కుంటాడు!

తెలంగాణ రాజ‌కీయాల్ని ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కుదిపేస్తోంది. కేసీఆర్ ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తోనే తెలంగాణ‌లో రాజ‌కీయ ప్ర‌ముఖులు, మీడియాధిప‌తుల‌తో పాటు న్యాయ‌మూర్తుల సెల్‌ఫోన్ల‌ను ట్యాప్ చేశార‌నే విష‌యం వెలుగు చూసింది. ఈ నేప‌థ్యంలో అంద‌రి వేళ్లు…

తెలంగాణ రాజ‌కీయాల్ని ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కుదిపేస్తోంది. కేసీఆర్ ప్ర‌భుత్వ అండ‌దండ‌ల‌తోనే తెలంగాణ‌లో రాజ‌కీయ ప్ర‌ముఖులు, మీడియాధిప‌తుల‌తో పాటు న్యాయ‌మూర్తుల సెల్‌ఫోన్ల‌ను ట్యాప్ చేశార‌నే విష‌యం వెలుగు చూసింది. ఈ నేప‌థ్యంలో అంద‌రి వేళ్లు కేసీఆర్‌, కేటీఆర్ వైపు చూపుతున్నాయి. 

ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ప‌క్షాల‌కు ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం ఆయుధంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌లేదంటూ ప‌ర‌స్ప‌రం నిల‌దీసుకుంటున్నారు. 

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్ ఇరుక్కున్నార‌ని విమ‌ర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని వ్య‌వ‌హార‌మ‌న్నారు. కావున ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో కేంద్ర ప్ర‌భుత్వం విచారించాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్ స్వ‌యంకృతాప‌రాధం వ‌ల్లే అధికారాన్ని కోల్పోయార‌ని విమ‌ర్శించారు. 

బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్‌ను నిల‌దీశారు. ఢిల్లీ పెద్ద‌ల నుంచి అనుమ‌తి కోసం ఎదురు చూస్తున్నారా? అని సీఎంను ఆయ‌న నిల‌దీశారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్ప‌డ్డార‌ని కేసీఆర్‌, కేటీఆర్‌కు సంబంధించి ఆధారాలు స్ప‌ష్టంగా దొరికినా ఇంకా మీన‌మేషాలు లెక్కించ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు.