బాబును తిట్టాలనుంది కానీ.. భయం!

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీచేయకుండా తప్పుకోవడంపై చంద్రబాబును నిందించాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బలమైన కోరిక ఉండవచ్చు. గత ఎన్నికల్లో బాహాటంగా కాంగ్రెస్ తో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకున్నాడని.. ఈ ఎన్నికల్లో పొత్తుపెట్టుకోడానికి భయపడి.. పోటీనుంచి…

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీచేయకుండా తప్పుకోవడంపై చంద్రబాబును నిందించాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బలమైన కోరిక ఉండవచ్చు. గత ఎన్నికల్లో బాహాటంగా కాంగ్రెస్ తో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకున్నాడని.. ఈ ఎన్నికల్లో పొత్తుపెట్టుకోడానికి భయపడి.. పోటీనుంచి పిరికిగా తప్పుకోవడం ద్వారా..కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందంతో వ్యవహరిస్తున్నాడని, ఆయన మీద విమర్శలు చేయాలని కేసీఆర్ కు కోరిక ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ఆయన అలాంటి సాహసం చేయడానికి సిద్ధంగా లేరు.

గత 2018 ఎన్నికల సందర్భంలో అయితే.. కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయి. చంద్రబాబునాయుడు మీద కేసీఆర్ ఏ రేంజి విమర్శలతో విరుచుకుపడినారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంత దారుణంగా ఓడిపోవడానికి కూడా చంద్రబాబునాయుడే కారణం అని ఆ పార్టీ గట్టిగా నమ్మేలాగా.. ఆయన తన విమర్శలన్నీ చంద్రబాబు మీదనే ఫోకస్ చేశారు. ఏ సభలో చూసినా.. చంద్రబాబునాయుడు మీదనే. కాంగ్రెసు కంటె అతిగా చంద్రబాబును తిట్టారని అన్నా కూడా అతిశయోక్తి కాదు.

ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోలేదు. కానీ.. కాంగ్రెస్ కు తెలుగుదేశం పరోక్షంగా మేలు చేస్తోంది. కాంగ్రెస్ కు అంతో ఇంతో విజయావకాశాలు మెరుగుపడడానికి వీలుగా తెలుగుదేశం ఏకంగా పోటీనుంచే తప్పుకుంది. పార్టీ ఏదో పోటీచేద్దాం అని ఉత్సాహం చూపిస్తున్నారుగానీ.. అది వర్కవుట్ కాదు. పరోక్షంగా కాంగ్రెస్ విజయానికి సహకరించాల్సిందిగా వారికి తెరవెనుక సూచనలు వెళ్తాయని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇంత జరుగుతున్నా సరే.. పోటీనుంచి తప్పుకోవడానికి సంబంధించి చంద్రబాబు మీద ఇప్పటిదాకా గులాబీదళం నుంచి విమర్శలు మొదలు కాలేదు. ఈ దఫా ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేసి తిడితే.. బ్యాక్ ఫైర్ అవుతుందనే భయం కేసీఆర్ లో ఉన్నట్లుంది. 

ప్రస్తుతం చంద్రబాబునాయుడు జైల్లో ఉన్నారు. ఆయన పట్ల ఎంతో కొంత సానుభూతి తయారై ఉండే అవకాశం ఉంది. అలాగే.. ఈ సమయంలో చంద్రబాబును తిట్టడం వలన.. భారాస కోరుకుంటున్న సెటిలర్/ కమ్మ ఓటు బ్యాంకు దూరమయ్యే అవకాశం ఉందని గులాబీ దళం భావిస్తున్నట్టు సమాచారం. 

అందుకే ఈ దఫా చంద్రబాబును టార్గెట్ చేయకుండా.. కాంగ్రెస్ పార్టీ మీదనే ఫోకస్ పెట్టి గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆయన వ్యూహాలు ఏమేర ఫలిస్తాయో వేచిచూడాలి.