హరీష్‌రావును ఓడించడం కేటీఆర్‌కు ఈజీ కాదు!

కంగారు పడాల్సిన అవసరమేం లేదు. హరీష్ రావు ఎమ్మెల్యే ఎన్నికల్లో నెగ్గకుండా చేయడానికి కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని చెప్పే వార్త కాదిది. కానీ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కాకపోయినప్పటికీ.. ఒక విషయంలో బావ హరీష్…

కంగారు పడాల్సిన అవసరమేం లేదు. హరీష్ రావు ఎమ్మెల్యే ఎన్నికల్లో నెగ్గకుండా చేయడానికి కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని చెప్పే వార్త కాదిది. కానీ, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కాకపోయినప్పటికీ.. ఒక విషయంలో బావ హరీష్ రావుతో.. కేటీఆర్ ఈసారి గట్టిగానే తలపడుతున్నారు. అదే.. ఎవరు ఎక్కువ మెజారిటీ సాధిస్తారనే విషయంలో! తెలంగాణ రాజకీయాలు, భారాస పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఇద్దరు నాయకుల విషయంలో సాధించగల మెజారిటీకోసం తీవ్రమైన పోటీ ఉంది. 

సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఆత్మీయుడిగా మారిపోయిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. గత ఎన్నికల్లో కూడా అక్కడ రికార్డు మెజారిటీ సాధించారు. దాన్ని అధిగమించి, పార్టీలో తనను మించిన ప్రజాదరణ కలిగిన నాయకుడు లేడని నిరూపించుకోవాలనే కోరిక కేటీఆర్ కు ఉన్నది గానీ.. అంత మెజారిటీ సాధించడం ఆయనకు సాధ్యమేనా? అనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.

2018 ఎన్నికల్లో భారాస హవా బాగానే పనిచేసింది. మంత్రి హరీష్ రావుకు ఆ ఎన్నికల్లో ఏకంగా 1.18 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది.  అదేసమయంలో కేటీఆర్ సాధించిన మెజారిటీ కేవలం 89 వేలు మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. సిద్దిపేటలో హరీష్ రావుతో తలపడిన వారెవ్వరికీ అసలు డిపాజిట్లు  కూడా దక్కలేదు. కానీ కేటీఆర్ పరిస్థితి అది కాదు. గత ఎన్నికల్లో భాజపాకు అక్కడ ఠికానా లేకపోయినా.. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి 36 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

ఈసారి ఎన్నికల్లో కూడా సిరిసిల్లలో కాంగ్రెస్ తరఫున కేకే మహేందర్ రెడ్డి పోటీచేస్తున్నారు. 2009 ఎన్నికల్లో భారాస తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగి కేవలం 171 ఓట్ల తేడాతో ఓడిపోయినా, కేటీఆర్ లో వణుకు పుట్టించిన మహేందర్ రెడ్డి ప్రాభవం ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. భారాస అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన ప్రాబల్యం ఇంకా తగ్గింది. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాసంబంధాలు ఉన్న ఆయన వరుసగా ఓడుతున్నారనే సానుభూతిని క్యాష్ చేసుకోగలిగితే.. మహేందర్ రెడ్డి ఓట్లు పెరుగుతాయి. అలాగే బిజెపి గత ఎన్నికల్లో సాధించిన ఓట్లకంటె ఈసారి రాణి రుద్రమ కాసిని ఎక్కువ ఓట్లు సాధించినాకూడా కేటీఆర్ మెజారిటీ తగ్గుతుంది.

సిద్దిపేట విషయంలో అసలు తిరుగులేదు. సిద్ధిపేట ప్రజలు హరీష్ రావును ఎంతో ఆత్మీయుడిగా భావిస్తారు. ఆయనకు ఎంతో విలువ ఇస్తారు. ప్రజలలో తిరుగులేని ప్రజాదరణ ఉంది. అక్కడ మరొకరు విజయం సాధించడం అనేది అసాధ్యం. గత ఎన్నికల్లో అక్కడ ప్రత్యర్థులు ఎవ్వరికీ డిపాజిట్లు దక్కలేదు. ఈసారి కూడా డిపాజిట్లు దక్కుతాయనే గ్యారంటీ లేదు. మెజారిటీ పెరిగేదే గానీ తగ్గేది లేదని ప్రజలు అంటున్నారు. 

ఈ నేపథ్యంలో.. మెజారిటీ విషయంలో బావ హరీష్ రావును అధిగమించి, ఆయనను ఓడించేంత సీన్ కేటీఆర్ కు లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.