అధికారం పోగానే పొలిటికల్ లీడర్లకు అల్జీమర్స్

ఏ పార్టీ అయినా సరే అధికారం పోగానే అంటే ఎన్నికల్లో ఓడిపోగానే ఆ పార్టీ లీడర్లకు అల్జీమర్స్ వచ్చేస్తుంది. అల్జీమర్స్ అంటే తెలుసు కదా. ఏ విషయం గుర్తుండకపోవడమన్న మాట. అంటే గతం మర్చిపోవడమన్న…

ఏ పార్టీ అయినా సరే అధికారం పోగానే అంటే ఎన్నికల్లో ఓడిపోగానే ఆ పార్టీ లీడర్లకు అల్జీమర్స్ వచ్చేస్తుంది. అల్జీమర్స్ అంటే తెలుసు కదా. ఏ విషయం గుర్తుండకపోవడమన్న మాట. అంటే గతం మర్చిపోవడమన్న మాట. ఇప్పుడు గులాబీ పార్టీ నాయకులు ముఖ్యంగా అధినేత కేసీఆర్ అండ్ ఆయన కుమారుడు కమ్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. అది నిజమైన బాధ కాదు. రాజకీయ మతిమరుపు.

పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతుంటే నిస్సహాయ స్థితిలో నుంచి వచ్చిన మతిమరుపు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే … కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు కదా. వాళ్ళెవరూ పదవులకు రాజీనామా చేయలేదు. దీంతో కేటీఆర్ కు కోపం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద మండి పడ్డాడు. రాజ్యాంగం మీద గౌరవం లేదన్నాడు. ఏ విలువలూ పాటించడం లేదన్నాడు.

పదవులకు రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలని సుద్దులు చెబుతున్నాడు. కానీ ఆయనకు అలా చెప్పే హక్కు లేదు. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అండ్ టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నాడు. అప్పుడు వారితో రాజీనామా చేయించలేదు. పైగా కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు.

తెలంగాణా ఉద్యమాన్నే వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో దొంగ రాజీనామా చేయించి మంత్రి పదవి ఇచ్చాడు. కేటీఆర్ కు ఆ విషయం తెలియదా? తెలుసు. తన బాపు రాజ్యాంగ విలువలు పాటించలేదని తెలుసు. దాన్ని తుంగలో తొక్కాడని తెలుసు. కానీ ఇప్పుడు రాజ్యాంగం.. విలువలు అంటూ నీతులు, సుద్దులు చెబుతున్నాడు. కేసీఆర్ సవ్యంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు కేటీఆర్ మాటలకు విలువ ఉండేది.