గుడిలో పూజారికి యావజ్జీవ కారాగారం

కేసును పరిశీలించిన కోర్టు, సాయికృష్ణకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఆలయంలో నిత్యం దేవుడ్ని స్మరిస్తూ, గర్భగుడిలో గడిపే పూజారి మర్డర్ చేశాడంటే నమ్మగలమా? అలాంటి నమ్మలేని పని చేశాడు పూజారి వెంకట సాయికృష్ణ. 2023లో సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో ఇతడ్ని దోషిగా తేల్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అప్సర అనే మహిళను హత్య చేసినందుకు, అతడికి జీవిత ఖైదు విధించింది.

అది 2023, జూన్ 3.. విమానం టికెట్లు బుక్ చేశాను, కోయంబత్తూరు వెళ్దామంటూ అప్సరను రెడీ అవ్వమన్నాడు పూజారి సాయికృష్ణ. ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు కారు తీశాడు. శంషాబాద్ మండలం రాళ్లగూడ వద్ద ఓ హోటల్ లో భోజనం కూడా చేశారు.

రాత్రంతా అక్కడక్కడ కారులో తిప్పి, మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున మూడున్నర టైమ్ లో ఓ ఖాళీ వెంచర్ లోకి తీసుకెళ్లాడు. నిద్రలో ఉన్న అప్సర ముఖంపై సీటు కవర్ అదిమిపట్టి ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత రాయితో తల వెనక భాగంలో పదిసార్లు బలంగా కొట్టాడు. దీంతో అప్సర అక్కడికక్కడే మృతి చెందింది. అదే కారులో తన ఇంటికి చేరుకొని మృతదేహాన్ని కారులోనే ఉంచి, కవర్ కప్పాడు.

2 రోజుల తర్వాత కారులో ఉన్న మృతదేహాన్ని కవర్ లో చుట్టి సరూర్ నగర్ బంగారు మైసమ్మ ఆలయం సమీపంలోని మ్యాన్ హోల్ లో పడేశాడు. దుర్వాసన వస్తోందంటూ కూలీలను పిలిచి, 2 ట్రక్కుల మట్టి తీసుకొచ్చి మ్యాన్ హోల్ కప్పేశాడు. దానిపై సిమెంట్ కూడా వేసి పూడ్పించాడు.

అప్సర కనిపించడంలేదంటూ ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, మొదట్నుంచి సాయికృష్ణనే అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా మొత్తం బయటపెట్టాడు సాయికృష్ణ.

గ్రహ దోష పూజల కోసం తన వద్దకొచ్చిన అప్సరతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు సాయికృష్ణ. పెళ్లి చేసుకోవాలంటూ ఆమె సతాయించడంతో చంపేశానని అంగీకరించాడు. సాయికృష్ణకు అప్పటికే పెళ్లయింది. ఓ బిడ్డకు తండ్రి కూడా.

కేసును పరిశీలించిన కోర్టు, సాయికృష్ణకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు అదనంగా మరో ఏడేళ్లు జైలుశిక్ష విధించడంతో పాటు, అప్సర కుటుంబ సభ్యులకు 10 లక్షలు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది.

2 Replies to “గుడిలో పూజారికి యావజ్జీవ కారాగారం”

Comments are closed.