షాద్ నగర్ లో ఉన్మాది.. కత్తితో పొడిచి పరారీ

ప్రేమ ముసుగులో ఉన్మాదులు పెట్రేగిపోతున్నారు. మొన్నటికిమొన్న హైదరాబాద్ లో జరిగిన ఘటన మరవకముందే, సేమ్ సీన్ షాద్ నగర్ లో రిపీటైంది. ప్రేమించమంటూ వెంటపడిన ఓ యువకుడు.. ఉన్మాదిగా మారాడు. ప్రేయసిని కత్తితో పొడిచి…

ప్రేమ ముసుగులో ఉన్మాదులు పెట్రేగిపోతున్నారు. మొన్నటికిమొన్న హైదరాబాద్ లో జరిగిన ఘటన మరవకముందే, సేమ్ సీన్ షాద్ నగర్ లో రిపీటైంది. ప్రేమించమంటూ వెంటపడిన ఓ యువకుడు.. ఉన్మాదిగా మారాడు. ప్రేయసిని కత్తితో పొడిచి పరారయ్యాడు.

షాద్ నగర్ లో ఉంటున్న యువతికి, ఫరూక్ నగర్ మండలం సంస్థాన్ పల్లి గ్రామానికి చెందిన యువకుడితో పరిచయమైంది. ఇద్దరూ కలిసి ఓ షాపులో పనిచేసేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు యువకుడు పని మానేశాడు. అమ్మాయి మాత్రం అదే షాపులో పనిచేస్తోంది.

షాపులో పని మానేసినా, యువతి వెంట పడ్డాడు ఇతగాడు. ప్రేమించమంటూ వేధింపులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో యువతి, షాపులోని మరో వ్యక్తితో చనువుగా ఉంటోందనే అనుమానం పెంచుకున్నాడు. దీంతో తనకు దక్కని అమ్మాయి, వేరే ఎవ్వరికీ దక్కకూడదని నిర్ణయించుకున్నాడు.

పథకం ప్రకారం, కత్తితో అమ్మాయి ఇంటికెళ్లాడు. అమ్మాయిలో కాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత గొడవ పడ్డాడు. ఇంట్లో మేడ పైన బట్టలు ఆరేస్తున్న టైమ్ లో వెంట తెచ్చుకున్న కత్తి తీసి, ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. ఊహించని ఘటనతో అమ్మాయి కేకలు పెట్టింది. దీంతో యువకుడు అక్కడ్నుంచి పరారయ్యాడు.

రక్తపు మడుగులో ఉన్న యువతిని స్థానికులు వెంటనే సమీపంలోని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆమె చేతి మణికట్టుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది, యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.