తెలంగాణలో అధికార పార్టీ గ్రాఫ్ పడిపోతోందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఎలాంటి ఉద్యోగ ప్రకటన లేకపోవడం, అలాగే హామీలను నెరవేర్చడంలో నాన్చివేత ధోరణి తదితర అంశాలు కాంగ్రెస్‌పై వ్యతిరేకతకు కారణాలుగా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై చూపుతున్న శ్రద్ధ, ప్రజలకు మంచి చేయడంపై కనబరచడం లేదనేది ప్రధాన విమర్శ.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతోందని సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తీవ్ర ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్, అందులో కేవలం సగం మాత్రమే దక్కించుకుందని విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప, మరే హామీని రేవంత్‌రెడ్డి సర్కార్ ఇంత వరకూ అమలు చేయలేదని ఆయన అన్నారు.
గత ప్రభుత్వాన్ని గద్దె దించింది నిరుద్యోగులే అని ఆయన చెప్పుకొచ్చారు. నిరుద్యోగుల పాలిట తల్లిదండ్రుల పాత్ర పోషించిన ప్రభుత్వం, వారిని పడేసి తన్నుతోందని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగుల ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మోత్కుపల్లి ఘాటు విమర్శలు చేశారు. ఇది ఏ మాత్రం సరైన విధానం కాదని ఆయన అన్నారు.
దళితుడైన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. టికెట్ల విషయంలో మాదిగలకు అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు.