నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి బంధువు, ఆయనకు చెందిన సిటీ కేబుల్ ఉద్యోగి చంద్రమౌళీశ్వర్‌రెడ్డిని అదే పార్టీకి చెందిన వారు కిడ్నాప్ చేశారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నంద్యాల జిల్లాలో కేబుల్ నెట్ వర్క్ వ్యాపారంపై టీడీపీ నేతల మధ్యే వార్ సాగుతోంది.
ఇందులో భాగంగానే చంద్రమౌళీశ్వర్‌రెడ్డి కిడ్నాప్‌ను చూడాల్సి వుంటుంది. 15 ఏళ్ల క్రితం భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి కలిసి కేబుల్ నెట్ వర్క్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో భూమా నాగిరెడ్డి తన అవసరాల రీత్యా తన షేర్‌ను అమ్ముతూ వెళ్లారు. చివరికి ఆయనకు ఎలాంటి షేర్ లేదని ఏవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. అయితే తన తండ్రికి ఏవీ కేబుల్ వ్యాపారంలో భాగం ఉన్నట్టు ఆయన పిల్లలు వాదిస్తున్నారు.
ఈ క్రమంలో నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో కేబుల్ వ్యాపారాన్ని దక్కించుకోడానికి ప్రయత్నాలు మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి చంద్ర కిడ్నాప్ రాజకీయ దూమారం లేపింది.
ఎలాగోలా అతను తప్పించుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ప్రజాప్రతినిధి అనుచరులే తనను కిడ్నాప్ చేసి కొట్టినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు. ప్రస్తుతం రెండు టీడీపీ గ్రూప్‌ల మధ్య సాగుతున్న వైరం … రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనే భయాందోళన కలిగిస్తోంది. చంద్రబాబు సర్కార్ కఠిన చర్యలు తీసుకోకపోతే ఆళ్లగడ్డ, నంద్యాలలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే ప్రమాదం లేకపోలేదని స్థానికులు అంటున్నారు.