ఆ మాటలతో స్థాయి దిగజార్చుకున్న మోడీ!

కీలకస్థాయిలో ఉండే రాజకీయ నాయకుల మద్య సవాలక్ష సంభాషణలు జరుగుతాయి. అన్ని విషయాలనూ వారు బహిరంగంగా బయటకు చెప్పరు. ప్రెవేటు సంభాషణల్లో వాటి గురించి ముచ్చటించుకోవాల్సిందే తప్ప, ఓపెన్ గా చెప్పడం కరెక్టు పద్దతి…

కీలకస్థాయిలో ఉండే రాజకీయ నాయకుల మద్య సవాలక్ష సంభాషణలు జరుగుతాయి. అన్ని విషయాలనూ వారు బహిరంగంగా బయటకు చెప్పరు. ప్రెవేటు సంభాషణల్లో వాటి గురించి ముచ్చటించుకోవాల్సిందే తప్ప, ఓపెన్ గా చెప్పడం కరెక్టు పద్దతి అనిపించుకోదు. 

రాజకీయాలకు అవసరమైన నైతిక విలువల కిందికి రాదు. కానీ ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తన తెరవెనుక సంభాషణలను వెల్లడించడం ద్వారా ఆ విలువలను మీరారనే విమర్శ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. రాజకీయ ధర్మాన్ని మోడీ విస్మరించారని పలువురు అంటున్నారు.

నాయకులు మధ్య అనేకానేక సంభాషణలు నడుస్తాయి. ప్రెవేటుగా జరిగే సంభాషణలను సాధారణంగా వారు బహిరంగపరచరు. అవి లీక్ అయితే అది వేరే సంగతి. కానీ.. వేదికల మీదినుంచి చెప్పడం అనేది జరగదు. ఇది ఒక అప్రకటిత నీతిగా పాటిస్తూ ఉంటారు. 

నిన్న‌ నరేంద్రమోడీ.. తమ ఎన్డీయేలో భాగస్వామిగా చేరాలనే ఆకాంక్షను కేసీఆర్ తనతో గతంలో వ్యక్తం చేశారని ఇందూరు సభలో వెల్లడించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఉన్నదంటే.. మీదేమైనా రాచరికం అనుకుంటున్నారా అంటూ తాను ఎద్దేవా చేసినట్టు కూడా చెప్పుకున్నారు.

ఈ సంభాషణ, అచ్చంగా ఇలాగే, జరిగిందో లేదో బాహ్య ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే ఇది ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఇవాళ నరేంద్రమోడీ ఇలా జరిగిందని చెప్పారు. ఆయనను నమ్మే వాళ్లందరూ నిజమే అని వాదిస్తారు. రేపో మాపో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి.. నరేంద్రమోడీ వట్టి ఫాల్తూ మాటలు, ఝూటా మాటలు చెబుతున్నారని ఆగ్రహిస్తారు. అప్పుడిక ఆయనను నమ్మేవాళ్లందరూ అదే నిజమని వాదిస్తారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో నిజానిజాలను తేల్చడం కష్టం.

కానీ.. మోడీ మాత్రం ఈ మాటలను బయటకు, బహిరంగ వేదిక మీదనుంచి చెప్పడం ద్వారా తన స్థాయి దిగజార్చుకున్నారు. ఒక నాయకుడు ఇలాంటి మాటలు చెబితే.. భవిష్యత్తులో ఇంకేదైనా పార్టీల వారు కూడా.. తాము మోడీతో చేరిక, విలీనం వంటి అంశాల గురించి మంతనాలు సాగించాలనుకుంటే భయపడతారు. 

ఒకవేళ డీల్ కుదరకపోతే.. మోడీ, విలువలు పాటించకుండా తమ సంభాషణల్ని బయటపెడతారని కూడా అనుమానిస్తారు. ఆ రకంగా మోడీ తన క్రెడబిలిటీ పోగొట్టుకున్నట్టు లెక్క. బహుశా ఇక ఎన్నటికీ తనకు ఎవ్వరితోనూ అవసరం రాదని, ఎవరూ తనను విశ్వసించాల్సిన అవసరం లేదని అనుకున్నారేమో తెలియదు గానీ.. ప్రెవేటు సంభాషణను బహిరంగపరచారని పలువురు భావిస్తున్నారు.