తెలంగాణ‌లో ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆత్మ‌హ‌త్య‌!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిజామాబాద్ అర్బ‌న్ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన క‌న్న‌య్య గౌడ్ (35) ఆదివారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఉరి వేసుకుని ఆయ‌న…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిజామాబాద్ అర్బ‌న్ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన క‌న్న‌య్య గౌడ్ (35) ఆదివారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఉరి వేసుకుని ఆయ‌న త‌నువు చాలించాడు. దీంతో తెలంగాణ ఎన్నిక‌ల్లో క‌ల‌క‌లం రేగింది.

వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా వుండ‌గా య‌మ‌గంటి క‌న్న‌య్య‌గౌడ్ ఎన్నిక‌ల బ‌రిలో ఇండిపెండెంట్‌గా దిగ‌డం, అనంత‌రం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆయ‌న‌కు రోటి మేక‌ర్‌ను ఎన్నిక‌ల గుర్తుగా కేటాయించ‌డం విశేషం. ఎన్నిక‌ల్లో సీరియ‌స్‌గా పోటీ చేస్తున్నారా? లేక మ‌రేదైనా కార‌ణంతో బ‌రిలో ఉన్నారా? అనేది తెలియాల్సి వుంది.

ఎన్నిక‌ల్లో పోటీ చేసే స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌ను ఎవ‌రైనా హ‌త్య చేసినా, లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డినా ఎన్నిక‌లు వాయిదా వేసే అవ‌కాశాలు త‌క్కువే. గ‌తంలో క‌డ‌ప‌లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎంపీగా పోటీ చేసిన‌ప్పుడు ఇండిపెండెంట్ అభ్య‌ర్థిని ప్ర‌త్య‌ర్థులు చంపారు. దీంతో అప్ప‌ట్లో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. వైఎస్సార్‌పై అక్క‌సుతో ప్ర‌త్య‌ర్థులు నాడు స్వ‌తంత్ర అభ్య‌ర్థిని చంప‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్వ‌తంత్ర అభ్య‌ర్థుల మ‌ర‌ణాల‌పై సీరియ‌స్‌గా ఆలోచించింది. ఎవ‌రైనా స్వ‌తంత్ర అభ్య‌ర్థులు మ‌ర‌ణిస్తే ఆ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయ‌కూడ‌ద‌ని విధాన‌ప‌ర‌మైన నిర్ణయం తీసుకున్న‌ట్టు సంబంధిత అదికారులు తెలిపారు. నిజామాబాద్ అర్బ‌న్ ఎన్నిక కూడా వాయిదా ప‌డే అవ‌కాశాలు లేవ‌ని చెబుతున్నారు.