ఒక అక్రమ సంబంధం.. రోడ్డున పడ్డ 2 కుటుంబాలు

కామాతురానాం.. అనే సామెత ఊరికే పుట్టలేదనిపిస్తుంది ఇలాంటి ఘటనలు చూస్తే. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇది రుజువైంది. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ జంట.. తామిద్దరం కలిసి…

కామాతురానాం.. అనే సామెత ఊరికే పుట్టలేదనిపిస్తుంది ఇలాంటి ఘటనలు చూస్తే. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇది రుజువైంది. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ జంట.. తామిద్దరం కలిసి ఉండేందుకు, తమ రెండు కుటుంబాల్ని ఫణంగా పెట్టారు. ఈ క్రమంలో 2 ప్రాణాలు పోగా, ఆ 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

సూర్యాపేట జిల్లాలోని మోతె మండలంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు వెంకన్న. అతడికి ఇద్దరు ఆడపిల్లలు. తన ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్న నస్రీన్ కుటుంబంతో అతడికి పరిచయం ఏర్పడింది. వెంకన్న-నస్రీన్ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఎలాగైనా కలిసి జీవించాలనుకున్నారు.

ఈ క్రమంలో భార్యను అడ్డుతొలిగించుకోవాలని నిర్ణయించుకున్నాడు వెంకన్న. భార్యను బైక్ పై తీసుకెళ్లి, విద్యుత్ స్తంభానికి ఆమెను కొట్టి చంపేశాడు. తర్వాత రోడ్డు యాక్సిడెంట్ గా చిత్రీకరించాడు. అందర్నీ నమ్మించాడు.

ఇటు నస్రీన్ కూడా భర్తను వదిలించుకోవడానికి రెడీ అయింది. ఏదో పనిమీద భర్త షేక్ రఫీ బయటకెళ్లాడని నిర్థారించుకొని, వెంకన్నకు ఫోన్ చేసింది. మరో ఇద్దరితో కలిసి నస్రీన్ ఇంట్లోకి వెళ్లి కాపుకాశాడు వెంకన్న. రఫీ ఇంటికి వచ్చిన వెంటనే అతడ్ని హత్య చేసి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారు.

అయితే రఫీ తమ్ముడికి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, మొత్తం గుట్టువిప్పారు. నస్రీన్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. వెంకన్న, నస్రీన్ తో పాటు, మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇటు నస్రీన్ ఇద్దరు పిల్లలు, అటు వెంకన్న ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు.