మేనిఫెస్టో మాట ఎత్తకుండానే ఎన్నికల్లో నెగ్గే పార్టీ!

ఎన్నికలు అనగానే.. ప్రజలను నమ్మించడం, వారి ఆదరణ చూరగొనడం, వారి ఓట్లను కొల్లగొట్టడం అధికార పీఠాన్ని అధిష్ఠించడం అనేది ఒక వరుస క్రమం. ఇందులో ప్రధానమైన మౌలిక సంగతి ప్రజలను నమ్మించడం. అంటే ఎలా?…

ఎన్నికలు అనగానే.. ప్రజలను నమ్మించడం, వారి ఆదరణ చూరగొనడం, వారి ఓట్లను కొల్లగొట్టడం అధికార పీఠాన్ని అధిష్ఠించడం అనేది ఒక వరుస క్రమం. ఇందులో ప్రధానమైన మౌలిక సంగతి ప్రజలను నమ్మించడం. అంటే ఎలా? మాటలు చెప్పాలి. మీకోసం అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పాలి. మమ్మల్ని గెలిపించండి చాలు.. మీ జీవితాలను మార్చేస్తాం అని హామీ ఇవ్వాలి. అలాంటి అనేకానేక హామీలను కట్టగట్టిన రూపమే ‘మేనిఫెస్టో’ అంటే! 

ఎన్నికల్లో పోటీచేసే ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో విషయంలో అనేక కసరత్తులు చేస్తుంటుంది.. ప్రజల మీద సమ్మోహక అస్త్రంగా పనిచేసే మేనిఫెస్టోను తయారుచేయాలని తంటాలు పడుతుంటుంది. కానీ.. అసలు మేనిఫెస్టో అనే ప్రయత్నమే చేయకుండా, అలాటి లిఖిత పూర్వక హామీలు ఇవ్వకుండా.. ఎన్నికల్లో తలపడి మినిమం గ్యారంటీ సీట్లను గెలుచుకునే పార్టీ కూడా ఒకటుంది. అదే మజ్లిస్ పార్టీ! ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. తమ పార్టీకి మేనిఫెస్టో ఉండబోదని స్పష్టం చేసేశారు.

మజ్లిస్ సాధారణంగా ముస్లిం ఓట్ల ప్రభావం అధికంగా ఉన్న పాతబస్తీ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను ప్రతిసారీ గెలుస్తుంటుంది. కేవలం ముస్లిం వర్గంలో వారికి నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉంటుంది. అది చెక్కు చెదరదు. వారి విజయాల సంఖ్యలో కూడా సాధారణంగా మార్పు రాదు. అందుకే వారికి కొత్తగా ప్రజలను నమ్మించాలనే అవసరం కూడా ఏర్పడుతున్నట్టు లేదు. అసదుద్దీన్ చాలా స్పష్టంగా ‘ప్రజలకు మేం చేస్తున్న పనులే మా ఎన్నికల మేనిఫెస్టో’ అని తేల్చిచెప్పేశారు.

అయితే అసదుద్దీన్ ఈ దఫా భారాస మేనిఫెస్టోకు బీభత్సంగా కితాబులు ఇవ్వడం విశేషం. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో పేదలకు వరంగా ఉందని ఆయన అంటున్నారు. అందులోని ప్రతి అంశాన్ని ప్రనత్యేకంగా కీర్తించారు. కేసీఆర్ తప్పకుండా మూడో సారి కూడా సీఎం అవుతారని ఒవైసీ జోస్యం చెప్పారు. 

ఈసారి కాంగ్రెస్, బిజెపిలు గట్టిగానే పోటీ పడుతున్న నేపథ్యంలో భారాసకు విజయం ఏకపక్షంగా దక్కుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. వారికి సీట్లు తగ్గినా.. తమ మజ్లిస్ మద్దతుతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుందనే ఆశ బహుశా ఒవైసీకీ ఉండవచ్చుననే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది. అందుకే కాబోలు.. మజ్లిస్ పోటీచేసే స్థానాల్లో తప్ప మిగిలిన అన్నిచోట్ల ముస్లిములు భారాసకే ఓటు వేయాలని కూడా ఒవైసీ పిలుపు ఇస్తున్నారు.