వారి అంచనాలలో సంకీర్ణమే ఉన్నదా?

కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన హవా ముందు ఇతర ప్రత్యర్థుల ట్రిక్కులు ఏవీ పనిచేయవని భారాస నాయకులు తమ ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు. ఇప్పటికే వెల్లడవుతున్న కొన్ని సర్వేలు మాత్రం.. భారాస చతికిలపడక తప్పదని,…

కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన హవా ముందు ఇతర ప్రత్యర్థుల ట్రిక్కులు ఏవీ పనిచేయవని భారాస నాయకులు తమ ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు. ఇప్పటికే వెల్లడవుతున్న కొన్ని సర్వేలు మాత్రం.. భారాస చతికిలపడక తప్పదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఆ ప్రచారానికి కౌంటర్ గా సర్వేలలో వారినే గెలవనివ్వండి.. పోలింగ్ లో మాత్రం మేం గెలుస్తాం అనే వాదన కూడా గులాబీదళాల్లో వినిపిస్తోంది. 

ఈ వాదప్రతివాదాలు ఇలా సాగుతుండగా.. కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్న మరో పార్టీ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి మాత్రం.. రాష్ట్రంలో సంకీర్ణ వస్తుందనే నమ్మకం చాలా బలంగా ఉన్నట్టుంది. ఇందుకు సంబంధించి ఆయన బలమైన సంకేతాలు ఇస్తున్నారు. సంకీర్ణం అనగా భారాసతో కలిసి తాము కూడా అధికారం పంచుకుంటామనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ తాజాగా జహీరాబాద్ లో తమ పార్టీ సమావేశంలో మాట్లాడారు. భాజపా- కాంగ్రెస్ రెండూ కూడా ఆరెస్సెస్ కు విధేయంగా పనిచేస్తున్నాయని అన్నారు. అయితే పనిలో పనిగా.. ముస్లిం సమాజం మొత్తం కేసీఆర్ కు అండగా నిలిచి భారాసను గెలిపించాలని పిలుపు ఇచ్చారు. నవంబరు 30న జరిగే ఎన్నికల్లో ‘మామ’కు మద్దతివ్వాలని అసదుద్దీన్ చెప్పడం విశేషం. మీరందరూ మద్దతివ్వండి. మామ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నచోటే అభివృద్ధి జరుగుతుంది.. అని ఆయన చెప్పారు. 

తెలంగాణలో అధికారం కోసం తలపడుతున్న మూడు పార్టీలతో పాటు, నాలుగో పార్టీగా మజ్లిస్ కూడా ఉన్నదని.. ఎన్నికల తర్వాత.. పవర్ ప్లేలో మాత్రమే మనమే ఆడుతాం అని ఆయన అంటున్నారు. పవర్ ప్లే అంటే తెలుసుగా, పవర్ ప్లే మొదలుపెట్టాం.. పవర్ మన చేతిలోనే ఉంటుంది.. అని కూడా అసదుద్దీన్ ముస్లింలకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ గతంలో కంటె బాగా బలం పుంజుకుని గట్టిగా తలపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. 2018లో విజయం సాధించినంత ఏకపక్షంగా భారాస మళ్లీ అధికారంలోకి రాకపోవచ్చుననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వారికి సీట్ల సంఖ్య తగ్గడం మాత్రం గ్యారంటీ. కాకపోతే.. ఆ తగ్గడం అనేది.. ఏకంగా ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ కంటె తక్కువగా ఉండేలా.. వెళుతుందా అనే భయాలు కూడా పలువురిలో ఉన్నాయి. 

అధికారంలోకి రావాలంటే.. 60 స్థానాలు అవసరమైన తెలంగాణలో.. సాధారణంగా మజ్లిస్ 7 స్థానాలు గెలుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో.. భారాస 53 స్థానాలు గెలిచినా కూడా మజ్లిస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగల అవకాశం ఉంటుంది. అసదుద్దీన్ ఒవైసీ తన ‘పవర్ ప్లే’ అనే మాటల ద్వారా.. కేసీఆర్ ఎంత చేసినా సరే.. సొంతంగా 60 సీట్లు గెలవడం అసాధ్యం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? అనే విశ్లేషణ ఇక్కడ ఎదురవుతోంది.