బాధాత‌ప్త హృద‌యంతో లేఖ రాస్తున్నా.. పార్టీని వీడుతున్నా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్‌. టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న కాంగ్రెస్‌ను…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్‌. టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న కాంగ్రెస్‌ను వీడ‌డం ఆ పార్టీకి దెబ్బే అని ప‌లువురి అభిప్రాయం. రాజీనామా లేఖ‌ను కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మల్లిఖార్జున ఖ‌ర్గేకు పొన్నాల పంపారు. ఈ లేఖ‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి వైఖ‌రిపై ప‌రోక్షంగా పొన్నాల ఘాటు కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

బీసీల‌కు అన్యాయం చేశార‌ని ఆయ‌న వాపోయారు. క‌నీసం త‌న‌తో మాట్లాడ్డానికి కూడా రేవంత్‌రెడ్డి ఆస‌క్తి చూప‌లేద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి వైఖ‌రితో పొన్నాల మ‌న‌స్తాపం చెందిన‌ట్టు ఆయ‌న లేఖ చ‌దివితే అర్థ‌మ‌వుతుంది. జ‌న‌గామ టికెట్ ఆశిస్తున్న ఆయ‌న‌కు ఇచ్చే ప‌రిస్థితి లేద‌నే సంకేతాలు వెలువ‌డ్డాయి. దీంతో ఆయ‌న పార్టీని వీడార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏఐసీసీ అధ్య‌క్షుడికి రాసిన  లేఖ‌లోని ప్ర‌ధాన అంశాలేంటో చూద్దాం.

“మ‌ల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షులు గారికి నమస్కారం…

అత్యంత బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలో కీలకమైన ఇంజనీర్‌గా పనిచేస్తూ అప్పటి జాతీయ నాయకులు పీవీ నరసింహారావు గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన నేను కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తగా చేరాను. సుమారు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ అధ్యక్షుల వరకు అనేక కీలక పదవులను నిర్వహించాను. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా, తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేయడం కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఆనందమైన రోజుల‌ని చెప్పుకున్నాను.

కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నన్ను తీవ్రంగా కలచి వేస్తున్నాయి. 2015లో నన్ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి అకారణంగా తొలగించిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు తొమ్మిదేళ్లు ఎలాంటి పదవి ఇవ్వ కున్నా అనేక‌ మాధ్యమాల ద్వారా నా గళం విప్పాను. గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా వ్యక్తి స్వామ్య రాజ్యమేలుతూ కాంగ్రెస్ పార్టీ భూమిపుత్రులుగా ఉన్న మాలాంటి వారిని అవమాన పరుస్తూ, కొత్తగా వచ్చిన వారికి పెద్ద పేట వేస్తూ అసలు సిసలైన సగటు కాంగ్రెస్ వాది నేడు పార్టీలో పరాయివాడిగా మారిపోయి ఉనికి కోల్పోయే పరిస్థితి దాపురించింది. నేను గత రెండు సంవత్సరాలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడడానికి అనేక పర్యాయాలు అపాయింట్‌మెంట్ కోరాను. కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోగా బయట ఎక్కడైనా కలిసినా కనీసం నమస్కారం పెడితే మాట్లాడకుండా, చూడకుండా అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక్కసారి కూడా బదులు ఇచ్చిన సందర్భం లేదు.

ఇక్కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అగ్ర నాయకుల చుట్టూ బీసీలు తిరిగితే పార్టీ పరువు పోతుంది. నేను 2001లో తెలంగాణ కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో మొదటి సంతకం పెట్టిన వాణ్ణి. పార్టీ కోసం అంకితభావంతో 40 ఏళ్లుగా పని చేసిన నాకే ఇంత అవమానం జ‌రిగితే కాంగ్రెస్‌లో స‌గ‌టు బీసీ నేత పరిస్థితి ఊహిస్తేనే భయమ‌వుతోంది.

ఎవరో డబ్బులు ఇచ్చారని, బీసీలు ఓడిపోయే వాళ్లంటూ టికెట్లు ఇవ్వకుండా పార్టీలో కొత్తగా వచ్చిన వారికి, డబ్బులు, భూములు, విల్లాలు, బంగారం ఇచ్చిన వారికి టికెట్లు ఇస్తూ పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతూ పార్టీని అమ్మకానికి పెట్టి ఒక ఒక వ్యాపార వస్తువుగా మార్చి వేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, వాళ్ళు  బజార్లో గొడ్లను అమ్మినట్టు పార్టీ టికెట్లను అమ్మకుంటున్నారు.

పార్టీ లో జరుగుతున్న ఈ వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో పార్టీ పరువు మట్టిలో కలిసిపోతుంది. దారుణమైన పరిస్థితిలో పార్టీలో అవమానాలు భరిస్తూ మనుగడ సాగించలేమన్న ఆవేదనతో  పార్టీతో నాకు ఉన్న అనుబంధాన్ని తెంచుకోవాలని అనుకుంటున్నాను. ఇంతకాలం పార్టీలో నాకు పదవులు ఇచ్చి ఆదరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు…!

పొన్నాల లక్ష్మయ్య”

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు గొడ్ల‌ను అమ్మిన‌ట్టు అమ్ముకుంటున్నార‌ని రేవంత్‌రెడ్డిపై పొన్నాల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ల‌కు క‌నీస గౌర‌వం ఇవ్వ‌లేద‌న్న‌ది ఆయ‌న ఆవేద‌న‌. నాలుగు ద‌శాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని ఆవేద‌న‌తో తెంచుకుంటున్న‌ట్టు పొన్నాల ఆవేద‌న‌తో చెప్పారు.