విచారణ సత్వరం తేల్చకపోతే డౌటే!

భారాసకు చెందిన ఎంపీ, దుబ్బాక నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు గురయ్యారు. హత్యాయత్నం జరిగింది.ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరకు వచ్చి, తన వద్ద దాచుకున్న కత్తితో కడుపులో…

భారాసకు చెందిన ఎంపీ, దుబ్బాక నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు గురయ్యారు. హత్యాయత్నం జరిగింది.ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరకు వచ్చి, తన వద్ద దాచుకున్న కత్తితో కడుపులో ఓ వ్యక్తి పొడిచాడు. సదరు వ్యక్తి ఒక యూట్యూబ్ చానెల్ కు రిపోర్టుగా పనిచేస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు. ఈ హత్యాయత్నం మీద ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం నడుస్తోంది.

ఈ హత్యాయత్నం కాంగ్రెస్ వాళ్లే చేయించారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి హత్యారాజకీయాలు తగవని, కాంగ్రెస్ పిరికి చర్య అని, మేం తలచుకుంటే ఏమవుతారో చూసుకోవాలని, కావాలనుకుంటే మొండికత్తి తమకు మాత్రం దొరకదా అని రకరకాల మాటలు అంటున్నారు. కొత్త ప్రభాకర రెడ్డిని యశోద ఆస్పత్రికి వెళ్లి పరామర్శించేందుకు తన ఎన్నికల ప్రచార సభను అర్థంతరంగా ముగించుకుని వచ్చేశారు. మొత్తానికి ఈ దుర్ఘటన నుంచి వీలైనంత ఎక్కువ మైలేజీ పొందడానికి కేసీఆర్, భారాస ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది.

అదే సమయంలో రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లను కూడా గమనించాలి. కత్తితో పొడిచిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి విచారించాలని, పారదర్శకంగా విచారణ జరిపి, ఈ కేసు నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. నింద కాంగ్రెసు పార్టీ మీద పడుతున్న నేపథ్యంలో.. ఆ వ్యక్తితో తమకు సంబంధం లేదని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అలా చెప్పడం సబబే. పనిలో పనిగా ఆయన నిందితుడు బిజెపికి చెందిన వ్యక్తి అని చెబుతున్నారు. రఘునందన రావుకు అనుచరుడు అంటున్నారు.

ఎమ్మెల్యే  రఘునందన రావు కూడా డిఫెన్స్ లో పడే పరిస్థితి. నిందితుడికి తనతో సంబంధం లేదని, అతని ఫేస్ బుక్ అకౌంట్ లో వి హనుమంతరావు తో దిగిన ఫోటోలు ఉన్నాయని చెప్పడం ద్వారా.. కాంగ్రెసుతో అనుబంధం ఉన్నట్లుగా ప్రచారం చేయడానికి తపన పడుతున్నారు. భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకుడి మీద కత్తిపోట్లు ఘటన జరగగానే.. నిందితుడికి రాజకీయ ప్రత్యర్థులతో ముడి పెట్టాలని.. ఎవరికి వారు వారి వారి ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు సత్వరం వాస్తవాలను నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది.

జాప్యం జరిగే కొద్దీ అధికార పార్టీ తీరు మీదనే జనంలో సందేహాలు కలుగుతాయి. అనే కానేక క్లిష్టమైన కేసులలో కూడా  రోజులు, గంటల వ్యవస్థలోనే నేరం చేసిన వారిని దొరకబుచ్చుకొని.. ప్రెస్ మీట్ పెట్టి మరి.. నేరానికి కారణమైన మోటివ్  లు కూడా రాబట్టి వెల్లడించే పోలీసులు.. కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేసిన వ్యక్తి విషయంలో కూడా అంతే వేగంగా స్పందించాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.