కేసీఆర్ కు మేలు చేయాలనేదే ఎర్ర లక్ష్యమా?

భారత రాష్ట్ర సమితితో చిట్టచివరి దాకా బేరాలాడుతూ కూర్చున్నారు. ఒకటి ఇస్తామంటే రెండు అంటూ పట్టుబట్టి పొత్తు వద్దనుకుని బయటకు వెళ్లారు. అక్కడినుంచి కాంగ్రెస్ తో బేరసారాలు మొదలుపెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి పాట పెరిగింది.…

భారత రాష్ట్ర సమితితో చిట్టచివరి దాకా బేరాలాడుతూ కూర్చున్నారు. ఒకటి ఇస్తామంటే రెండు అంటూ పట్టుబట్టి పొత్తు వద్దనుకుని బయటకు వెళ్లారు. అక్కడినుంచి కాంగ్రెస్ తో బేరసారాలు మొదలుపెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి పాట పెరిగింది. రెండు ఇస్తామని వాళ్లంటే.. మూడుకోసం పట్టుబట్టి చాలా కాలం సాగదీశారు. 

ససేమిరా అన్నతరువాత.. రెండుకే ఒప్పుకున్నారు. కానీ, వారు ఇచ్చింది కాకుండా తాము అడిగిందే కావాలంటూ ఆ తర్వాత ఇంకో పట్టుదల. ‘‘మాకు బలం ఉన్న చోట కాకుండా.. ఎక్కడెక్కడో ఇస్తామని అంటే మాకెందుకు’’ అని కూడా ఈ సీపీఎం వాళ్లు చాలా ఘాటుగా సెలవిచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ డీల్ మాత్రం కుదరలేదు. 

తాము సొంతంగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న తరువాత.. సీపీఎం పార్టీ వారు తీరు చూస్తోంటే.. భారత రాష్ట్ర సమితికి మేలు చేయడానికి, కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చూడడానికి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది.

మూడు అడిగారు, రెండు అయినా ఓకే మాకు బలం ఉన్న ఫలానా మాత్రమే కావాలన్నారు. డీల్ కుదరలేదు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు  17 స్థానాల్లో ఎందుకు పోటీచేస్తున్నారు. సీపీఎం 17 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయడం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పైగా దీనికి ‘తొలిజాబితా’ అని పేరు పెట్టారు. అంటే.. ఇంకా ఇతర నియోజకవర్గాల నుంచి ఎవరైనా ముందుకు వస్తే.. మలిజాబితా కూడా విడుదల చేస్తారన్నమాట.

పొత్తులు కోరుకున్నంత వరకు తమకు బలం ఉన్నది రెండు మూడు చోట్ల మాత్రమే అని నమ్మిన సీపీఎం ఇప్పుడు హఠాత్తుగా 17 చోట్ల ఎవరిని ఉద్ధరించడానికి పోటీచేస్తున్నదో ఆలోచించాలి. కేసీఆర్ తో లోపాయికారీ డీల్ కుదిరినందువల్లనే.. వీరిప్పుడు 17 చోట్ల బరిలోకి దిగుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. సీపీఎం ఒక్క ఓటు చీల్చగలిగినా.. అది ఖచ్చితంగా కాంగ్రెసుకు పడే ఓటు మాత్రమే అవుతుంది. అలాంటిప్పుడు.. అంతిమంగా భారాస అభ్యర్థులు విజయం సాధించడానికి తమ వంతు కృషి చేయడం కోసమే ఇలా చేస్తున్నారని అర్థమవుతోంది.

తరచుగా సిద్ధాంతాల గురించి మాట్లాడే వామపక్షాల వైఖరిపై ప్రజల్లో విశ్వాసం సడలిపోతోంది. ఎవరు పొత్తులకు అవకాశమిస్తే వారితో వెళతాం అన్న చందంగా.. ఒక స్థిరమైన విలువలు పాటించకుండా ఆ పార్టీలుఅనుసరిస్తున్న తీరు వారిని నవ్వులపాలు చేస్తోంది.