జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న దేనికి రేవంత్‌?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ఇక రెండువారాలే గ‌డువు. ప్ర‌తి ఓటూ కీల‌క‌మే. అయితే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డికి వైఎస్ జ‌గ‌న్ అభిమానుల ఓట్లు అక్క‌ర్లేద‌ని అనుకుంటున్నారేమో అనే అనుమానం క‌లుగుతోంది.…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ఇక రెండువారాలే గ‌డువు. ప్ర‌తి ఓటూ కీల‌క‌మే. అయితే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డికి వైఎస్ జ‌గ‌న్ అభిమానుల ఓట్లు అక్క‌ర్లేద‌ని అనుకుంటున్నారేమో అనే అనుమానం క‌లుగుతోంది. అన‌వస‌రంగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పేరు తీసుకొచ్చారు. అది కూడా నెగెటివ్ కోణంలో ప్ర‌స్తావించ‌డం ముమ్మాటికీ కాంగ్రెస్‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

టీడీపీ ఓట్లు ప‌డితే చాల‌ని రేవంత్ అనుకుంటున్న‌ట్టున్నారు. ఎల్లో చాన‌ల్ అధిప‌తి ఆర్కే ఇంట‌ర్వ్యూలో రేవంత్‌రెడ్డి సూక్తుల‌కు త‌క్కువేం లేదు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ ప్ర‌భుత్వం రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. రేవంత్‌రెడ్డి కొంత కాలం జైల్లో వుండాల్సి వ‌చ్చింది. ఇదంతా చంద్ర‌బాబు కోసం రేవంత్‌రెడ్డి చేసిన ప‌నికిమాలిన ప‌ని అని ఎవ‌రిని అడిగినా చెబుతారు.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే కేసీఆర్‌పైన ప్ర‌తీకారం తీర్చుకుంటారా? అని ఆర్కే ప్ర‌శ్న‌కు రేవంత్‌రెడ్డి ఇచ్చిన స‌మాధానం …ఔనా? నిజ‌మా? అని అనిపించేలా వుంది. ప్ర‌తీకారం అనే మాట‌కు చోటు లేద‌ని రేవంత్‌రెడ్డి సుద్ధులు చెప్పారు. త‌న‌ను చూస్తే ఎవ‌రికైనా అలా అనిపిస్తుందే త‌ప్ప‌, అది నిజం కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ప్రజలు అధికారం ఇచ్చేది వ్యక్తిగత పగ, కోపాన్ని కక్షలు సాధించుకోవడానికి కాదని రేవంత్ చెప్పారు. ఒక వ్యక్తి ఏదో అలా చేశాడని తాను కూడా అలా చేస్తానని అనుకోవడం త‌ప్ప‌ని రేవంత్ తెలిపారు. అలాంటి త‌ప్పు చేయ‌న‌ని ఆర్కే డిబేట్‌లో హామీ ఇచ్చారు. ఓకే…అంత మంచిగా పాల‌న సాగిస్తే ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ఏముంటుంది?

అయితే సీఎం కేసీఆర్ కుటుంబంపై ఎలాంటి విచార‌ణ జ‌ర‌గ‌దా? అని రేవంత్‌రెడ్డిని ఆర్కే ప్ర‌శ్నించారు. విచార‌ణ జ‌ర‌గ‌ద‌నేది చాలా త‌ప్పు అని రేవంత్ వెంట‌నే చెప్ప‌డం గ‌మ‌నార్హం. వ్యక్తిగత కక్ష, అక్రమ అరెస్ట్ వేరు.. చట్టబద్ధంగా చేయడం వేరని త‌న‌దైన శైలిలో వివ‌ర‌ణ ఇచ్చారు. విధానపరంగా, పరిపాలనపరంగా సమీక్షించినప్పుడు చట్టం ప్రకారం చేస్తామంటూనే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలాగా తాము ప్ర‌వ‌ర్తించ‌మ‌ని రేవంత్‌రెడ్డి చెప్ప‌డం కొస‌మెరుపు.  

ఏపీలో త‌న గురువు చంద్ర‌బాబును అరెస్ట్ చేసింది కూడా అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్ప‌డిన కేసులో అని రేవంత్‌రెడ్డి మ‌రిచిపోయిన‌ట్టున్నారు. స్కిల్ స్కామ్‌లో బాబు అరెస్ట్ అయ్యార‌ని, కేసులో  బ‌లం వుండ‌డం వ‌ల్లే న్యాయ‌స్థానాల్లో చంద్ర‌బాబుకు ఊర‌ట ద‌క్క‌లేద‌ని రేవంత్‌రెడ్డి తెలుసుకుంటే మంచిది. ఎవరి మెప్పు కోస‌మే జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తే, తెలంగాణ ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా న‌ష్ట‌మే త‌ప్ప‌, ఒరిగేదేమీ లేద‌ని రేవంత్ గ్ర‌హిస్తే మంచిది. అతికి పోతే, అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని రేవంత్‌కు ఇంకా అనుభ‌వాల నుంచి గుణ‌పాఠాలు నేర్చుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.