హైడ్రాను, అక్రమ నిర్మాణాల కూల్చివేతలను, మూసీ సుందరీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గులాబీ పార్టీ నాయకులు. అధినేత కేసీఆర్ గమ్మున ఉండి ఫామ్ హౌజ్ నుంచి కథ నడిపిస్తున్నాడు. బయట కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు చెలరేగిపోతున్నారు. ఇలా చెలరేగిపోతున్న ఈ ఇద్దరు మాజీ మంత్రులకు రేవంత్ రెడ్డి ఓ సహా ఇచ్చాడు. ఓ సవాల్ చేశాడు.
ఇన్నాళ్లు మూసీ సుందరీకరణ అన్న రేవంత్ రెడ్డి తాజాగా మూసీ పునరుజ్జీవం అన్నాడు. రెండూ ఒకటే అర్ధం అయినా సుందరీకరణ అంటే చాలా ఖరీదైన వ్యవహారంగా కనిపిస్తుంది. మూసీ పునరుజ్జీవం అంటే దాన్ని బాగుచేయడం అనే అర్థం వస్తుంది. కాబట్టి దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత కొంత తగ్గే అవకాశం వుంది. వాస్తవానికి మూసీ సుందరీకరణ ఆలోచన కేసీఆర్ సర్కారుది.
అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మూసీ సుందరీకరణ గురించి అనేకసార్లు చెప్పాడు. ఇందుకోసం మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న నిర్మాణాలు తొలగిస్తామని కూడా అప్పటి ప్రభుత్వం చెప్పింది. కేసీఆర్ అక్రమ నిర్మాణాల లెక్కలు కూడా చెప్పాడు. కానీ అధికారంలో ఉన్న పదేళ్లు ఆ పని చేయలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడ్డాడు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తే వ్యతిరేకిస్తున్నారు. నగరం బాగుపడటం కంటే వారికి ఓట్లే ప్రధానం. తాజాగా రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవం గురించి అసెంబ్లీలో చర్చిద్దామని, గులాబీ పార్టీ సలహాలు ఇవ్వాలని అన్నాడు. వాళ్ళేం సలహాలు ఇస్తారు? వారి విధానం వ్యతిరేకించడమే కదా. అసెంబ్లీ సాక్షిగా వారు అలా చేస్తే కాంగ్రెస్ దీనిపై ప్రజల్లో ప్రచారం చేస్తుంది. గులాబీ పార్టీని దోషిగా నిలబెడుతుంది.
మూసీ బాగును వ్యతిరేకిస్తున్న కేటీఆర్ అండ్ హరీష్ రావు , బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మూడు నెలలు మూసీ దగ్గర ఉండాలని, అలా ఉంటే తాను ఈ ప్రాజెక్టును విరమించుకుంటానని రేవంత్ సవాల్ చేశాడు. ఆ పని చేసే సాహసం వాళ్ళు చేయరు. మూసీ మురికి వాడల్లో వాళ్ళు ఎందుకు ఉంటారు? మూసీ పరీవాహక ప్రాంత పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలో సలహాలు ఇవ్వాలిగానీ వీళ్ళు మొత్తం పాజెక్టునే వ్యతిరేకిస్తున్నారు.
మూసీ సుందరీకరణ లేదా పునరుజ్జీవం అనే ఆలోచన తాము అధికారంలో ఉన్నప్పుడే చేశామని కేసీఆర్ కు గుర్తుంది. అందుకే కేటీఆర్, హరీష్ రావులను ఫామ్ హౌజ్ పిలిపించుకొని మూసీ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పాడట. గుడ్డిగా వ్యతిరేకించవద్దని చెప్పాడన్న మాట. బీజేపీలో కూడా ఈటల మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు.
అందుకే రేవంత్ రెడ్డి మిగతా వారి పేరు ఎత్తలేదు. మూసీ పునరుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నారంటే నగరంలో మురికివాడలు, అక్రమ నిర్మాణాలు ఉండాలని, వరదలు రావాలని, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లు ఉండాలని కోరుకుంటున్నారా?