బాబు ఓట్లు ముద్దు…వైఎస్ ఓట్లు వ‌ద్దా?

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి ఇంకా గుణ‌పాఠం నేర్చుకోలేదు. చంద్ర‌బాబును న‌మ్ముకుంటే ఏమ‌వుతుందో తెలిసి కూడా, ఆయ‌న‌పై అభిమానాన్ని చంపుకోలేకున్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన టీడీపీ జాతీయ…

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి ఇంకా గుణ‌పాఠం నేర్చుకోలేదు. చంద్ర‌బాబును న‌మ్ముకుంటే ఏమ‌వుతుందో తెలిసి కూడా, ఆయ‌న‌పై అభిమానాన్ని చంపుకోలేకున్నారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి రేవంత్‌రెడ్డి మ‌రోసారి కొమ్ము కాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

టీడీపీ ఓట్ల కోసం త‌న పూర్వాధ్య‌క్షుడు చంద్ర‌బాబుపై అభిమానం ప్ర‌ద‌ర్శించ‌డం బాగుంద‌ని, ఇదే సంద‌ర్భంలో దివంగ‌త వైఎస్సార్ అభిమానుల వ్య‌తిరేక‌త చ‌విచూడాల్సి వ‌స్తుంద‌నే క‌నీస స్పృహ రేవంత్‌లో క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. చంద్ర‌బాబు అరెస్ట్‌ను వ్య‌తిరేకిస్తూ టీడీపీ అనుకూల ఐటీ ఉద్యోగులు హైద‌రాబాద్‌లో ర్యాలీలు నిర్వ‌హించ‌డాన్ని మంత్రి కేటీఆర్ త‌ప్పు ప‌ట్టారు.

ఇలాంటి ఏవైనా వుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చూసుకోవాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. ఏపీ రాజ‌కీయ కాలుష్యాన్ని హైద‌రాబాద్‌లో వెద‌జ‌ల్లుతామంటే చూస్తూ ఊరుకోమ‌నే రీతిలో ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ కామెంట్స్‌పై రేవంత్‌రెడ్డి సీరియ‌స్‌గా స్పందించారు. బాబు అరెస్ట్‌పై తెలంగాణ‌లో నిర‌స‌న‌లు తెలుపుతామంటే త‌ప్పేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బాబు జాతీయ నాయ‌కుడ‌ని, సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన అలాంటి నాయ‌కులు దేశంలో చాలా త‌క్కువ మంది ఉన్నార‌న్నారు.

ఆంధ్రా వాళ్లు ఓట్లు కావాలి, వాళ్ల హ‌క్కులు వ‌ద్దా? అని కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. తాను టీపీసీసీ అధ్య‌క్షుడ‌నే విష‌యాన్ని రేవంత్‌రెడ్డి విస్మ‌రించిన‌ట్టున్నారు. ఇంకా తాను టీడీపీలో ఉన్న‌ట్టే ఆయ‌న భ్ర‌మిస్తున్నారనే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చంద్ర‌బాబును వెన‌కేసుకురావ‌డం అంటే వైఎస్సార్ అభిమానుల ఆగ్ర‌హాన్ని చ‌వి చూడ‌డ‌మే. బాబుకు వైఎస్సార్ అభిమానులు ప‌చ్చి వ్య‌తిరేకం. బాబుకు రేవంత్‌రెడ్డి వ‌కాల్తా పుచ్చుకోవ‌డం ద్వారా నిజ‌మైన కాంగ్రెస్ వాదుల ఓట్ల‌ను వ‌దులుకోడానికి సిద్ధ‌ప‌డ‌డ‌మే. బాబు కోసం మ‌రోసారి రాజ‌కీయంగా న‌ష్ట‌పోవ‌డానికి కూడా కాంగ్రెస్ సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది.

సీమాంధ్రులంతా టీడీపీ మ‌ద్ద‌తుదారులే అని రేవంత్‌రెడ్డి భావిస్తున్న‌ట్టున్నారు. సీమాంధ్ర‌ల్లో చంద్ర‌బాబును వ్య‌తిరేకించే వాళ్లంతా ఇప్పుడు రేవంత్‌రెడ్డి నేతృత్వం వ‌హిస్తున్న కాంగ్రెస్‌కు ఓట్లు వేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. వాళ్లంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్‌కు ఓటు వేయ‌డం అంటే చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థించ‌డ‌మనే అభిప్రాయం సీమాంధ్రుల్లో బ‌ల‌ప‌డుతోంది. అందుకే రేవంత్‌రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్‌కు న‌ష్టం క‌లిగిస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.