ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేసిన కొందరు రిటైర్ అయిపోయాకనో, మధ్యలోనే వీఆర్ఎస్ తీసుకోనో రాజకీయాల్లోకి వచ్చేస్తారు. సర్వీసులో ఉన్నప్పుడు చాలా ఆదర్శ భావాలతో ఉంటారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కొందరు అవకాశవాదులుగా మారుతారు. అసలు ఉన్నతాధికారులుగా (ఐఏఎస్, ఐపీఎస్) పనిచేసి రాజకీయాల్లోకి ఎంటరైన నాయకుల్లో పొలిటికల్ గా రాణించిన వారు చాలా తక్కువ.
డాక్టర్ జయప్రకాష్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తెలంగాణలో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో రాణించలేదనే చెప్పాలి. పదవుల్లో ఉన్నప్పుడు వీరు ముగ్గురూ ప్రజల ఆదరణ పొందిన వారే. మిగాతా ఇద్దరినీ అలా పక్కన పెడితే ఆరెస్పీ అంటే ప్రవీణ్ కుమార్ బహుజన భావజాలం కలిగిన వ్యక్తి. బహుజనులకు ఏదో చేయాలన్న తపనతోనే రాజకీయాల్లోకి వచ్చాడు.
తన సామాజిక నేపథ్యం, భావజాలానికి తగినట్లు మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్వాదీ పార్టీలో చేరాడు. తెలంగాణలో ఆ పార్టీని నడిపించే బాధ్యతలు కూడా తీసుకున్నాడు. కొంతకాలం అంతా సజావుగానే సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. కానీ పొత్తును విచ్చిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నించిందని, మాయావతి మీద ఒత్తిడి తెచ్చిందని, గులాబీ పార్టీతో పొత్తులేదని చెప్పాలని తనపై ఒత్తిడి చేశారని, కానీ పొత్తు ధర్మాన్ని ఉల్లఘించలేక బీఎస్పీని వదిలేస్తున్నానని చెప్పాడు. బీఎస్పీకి రాజీనామా చేశాడు. గులాబీ పార్టీలో చేరాడు.
ఆ పార్టీ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేశాడు. రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ ను, ఆయన ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. నిరుద్యోగ సమస్య, ఇతర సమస్యలపై పోరాటాలు చేశాడు. ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు లిక్కర్ కుంభకోణంలో కవితను ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించేవాడు. మనీష్ సిసోడియా జైల్లో ఉంటే వెయ్యి కోట్లు లాభం పొందటానికి ప్రయత్నించిన కవిత బయట ఎట్లా ఉంటుందని నిలదీశాడు. మీడియా ఇంటర్వ్యూల్లో కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడాడు.
కానీ తాను వ్యతిరేకించిన పార్టీలో చేరగానే అభిప్రాయాలు మారిపోయాయి. అసలుసిసలు పొలిటీషియన్ అయిపోయాడు. అభిప్రాయాలు మార్చుకోనివాడు పొలిటీషియన్ కాలేడని వందేళ్ల కిందటే గురజాడ అప్పారావు అన్నారు కదా. ఆరెస్పీ కూడా అభిప్రాయం మార్చుకున్నాడు. ఈమధ్య ఈయన, బాల్క సుమన్ తీహార్ జైలుకు వెళ్లి కవితను కలిశారు.
అక్కడి నుంచి వచ్చాక కవిత అరెస్టు అక్రమమని అన్నాడు. ఆమెను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని అన్నాడు. ఒకప్పుడు ఆదర్శ భావాలతో ఉన్న ఈ మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు అవకాశావాదిగా మారాడు. రాజకీయాల్లో ఉన్నపుడు ఏ గూటి చిలుక ఆ గూటి పాటే పాడాలి కదా.