బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న శేజల్, ఈరోజు మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. హైదరాబాద్ లోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో నిద్రమాత్రలు మింగి సూసైడ్ కు యత్నించింది శేజల్. వెంటనే స్పందించిన పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానికులు ఆమెను ఆటోలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఎమ్మెల్యే చిన్నయ్యపై కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తోంది శేజల్. ఎమ్మెల్యే తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు ఆమె జాతీయ మానవహక్కుల కమిషన్, మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఆమె ఢిల్లీలో తెలంగాణ భవన్ వద్ద, జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో ఆమె ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తాజాగా కేటీఆర్ తనను మోసం చేశారనేది ఆమె ఆరోపణ.తనకు న్యాయం చేస్తానని కేటీఆర్ మాటిచ్చారని, సమ్మె విరమింపజేశారని తెలిపిన ఆమె, తనపై లైంగిక దాడి జరిగిందనడానికి ఆధారాలు లేవంటూ తాజాగా కేటీఆర్ ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయింది.
ఈ వివరాలన్నింటినీ ఆమె తన సూసైడ్ లెటర్ లో రాసింది. కేటీఆర్ నమ్మకద్రోహానికి పాల్పడ్డారని అందులో పేర్కొంది. లేఖ చివర్లో ఆ పెద్దమ్మ తల్లే తనను కాపాడాలంటూ రాసింది. ఆ తర్వాత పెద్దమ్మ గుడికి చేరుకొని, బ్యాగ్ లో అప్పటికే తెచ్చిపెట్టుకున్న నిద్రమాత్రలు మింగి మూడోసారి ఆత్మహత్యకు యత్నించింది.
ఈసారి కూడా శేజల్ ను వైద్యులు కాపాడారు. ఆమె ఆయుర్వేదిక్ నిద్రమాత్రలు మింగిందని, ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు.
టీవీ9పై మరోసారి తీవ్ర విమర్శలు..
ఈ ఎపిసోడ్ ను ప్రసారం చేసిన టీవీ9పై సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు పడుతున్నాయి. ఓవైపు నిద్రమాత్రలు మింగి, గుడి ప్రాంగణంలో అపస్మారక స్థితిలో శెజల్ పడి ఉంటే, మరోవైపు టీవీ9 రిపోర్టర్ ఆ విజువల్స్ తీసుకోవడమే కాకుండా, అక్కడే నిలబడి తనదైన శైలిలో విశ్లేషణ ఇవ్వడాన్ని చాలామంది వ్యతిరేకించారు.
ఆమె ప్రాణాలతో బయటపడింది కాబట్టి సరిపోయింది, జరగరానిది జరిగి ఆమె ప్రాణాలు కోల్పోతే, ఆ టీవీ9 రిపోర్టర్ దే బాధ్యత అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఓవైపు ఆమె చావుబతుకుల్లో ఉంటే కాపాడాల్సింది పోయి, అలా మైక్ పట్టుకొని మాట్లాడ్డం అస్సలు బాగాలేదని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది, ఇదంతా టీవీ9 ఆడుతున్న డ్రామా అంటూ కామెంట్స్ చేయడం విశేషం.