ఎక్కడైనా ఓకే.. అక్కడ మాత్రం సెల్ఫీ నాట్ ఓకే

ఇదంతా సెల్ఫీ యుగం. సమయం-సందర్భంతో పట్టింపు లేకుండా సెల్ఫీలు దిగే కాలం. చావు దగ్గర కూడా సెల్ఫీలు దిగే లోకం ఇది. పొద్దున్న లేచామా సెల్ఫీతో రోజును ప్రారంభించామా అన్నట్టుంది కొంతమంది వ్యవహారం. అయితే…

ఇదంతా సెల్ఫీ యుగం. సమయం-సందర్భంతో పట్టింపు లేకుండా సెల్ఫీలు దిగే కాలం. చావు దగ్గర కూడా సెల్ఫీలు దిగే లోకం ఇది. పొద్దున్న లేచామా సెల్ఫీతో రోజును ప్రారంభించామా అన్నట్టుంది కొంతమంది వ్యవహారం. అయితే ఇది ఎక్కడైనా ఓకే కానీ, పోలింగ్ బూత్ దగ్గర మాత్రం అస్సలు ఓకే కాదు.

మరో 2 వారాల్లో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ మొదలవుతున్న వేళ, ఈ అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఓటు వేస్తూ లేదా ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పోలింగ్ బూత్ లో ఎవరైనా సెల్ఫీ దిగితే వాళ్లను అట్నుంచి అటు నేరుగా జైలుకు పంపిస్తారు. ఇది మాత్రం పక్కా.

ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలున్నాయి, ఎన్నికల కోడ్ లో నిబంధనలున్నాయి. ఎవరైనా పోలింగ్ బూత్ లో సెల్ఫీ దిగినట్టు గుర్తిస్తే వెంటనే అతడిపై పోలీసు కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత సదరు ఓటరు ఓటును 17-ఏ లిస్ట్ లో చేరుస్తారు. ఓట్ల లెక్కింపునకు ముందు ఆ లిస్ట్ ఆధారంగా, అతడి ఓటును పరిగణనలోకి తీసుకోరు. ఆ ఓటును రద్దయినట్టు ప్రకటిస్తారు.

పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. ఆ మాటకొస్తే సెల్ఫీనే కాదు, సాధారణ ఫొటోల్ని కూడా అనుమతించరు. ఇప్పటికే ఈ తరహా ఘటనలు దేశంలో పలుచోట్ల జరిగాయి. వాళ్లంతా కేసులు ఎదుర్కొంటున్నారు.

ఏ కేసు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ, ఎన్నికల సంఘం పెట్టే కేసుల నుంచి తప్పించుకోవడం చాలా అంటే చాలా కష్టం. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని పోలింగ్ లో పాల్గొంటే మంచిది.