ఆల‌స్యమే అయినా…ష‌ర్మిల‌కు జ్ఞానోద‌యం!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌కు అనుభ‌వాలు జ్ఞానోద‌యం క‌లిగించాయి. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్‌టీపీ అనే సొంత పార్టీని ఆమె స్థాపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆమె పాద‌యాత్ర చేశారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. నిరుద్యోగుల…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌కు అనుభ‌వాలు జ్ఞానోద‌యం క‌లిగించాయి. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్‌టీపీ అనే సొంత పార్టీని ఆమె స్థాపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆమె పాద‌యాత్ర చేశారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. నిరుద్యోగుల కోసం దీక్ష‌లు చేశారు. చివ‌రికి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆమె ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ నెలాఖ‌రులో జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆమె వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె మ‌ద్ద‌తు ప‌లికారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాల‌న్న ఆమె ప్ర‌య‌త్నాలు ఎందుకో అర్ధంత‌రంగా ఆగిపోయాయి. దీంతో ఎన్నిక‌ల బ‌రిలో వుంటామ‌ని, 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తామ‌ని ఆమె ప్ర‌క‌టించారు. వారం తిరిగే స‌రికి ష‌ర్మిల నిర్ణ‌యం మారిపోయింది. బ‌రి నుంచి త‌ప్పుకున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.

ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌టీపీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం వ‌ల్ల కాంగ్రెస్ ఓట్లు చీలితే చ‌రిత్ర త‌న‌ను క్ష‌మించ‌ద‌న్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ నియంత పాల‌న నుంచి తెలంగాణాను విముక్తి చేయాల‌న్న‌ది త‌న పార్టీ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీలితే మ‌ళ్లీ కేసీఆరే ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

వైఎస్సార్ త‌యారు చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించ వ‌ద్ద‌ని ఆ పార్టీ నేత‌లు త‌న‌ను కోరార‌న్నారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసే ఆలోచ‌న త‌న‌కు ఎంత మాత్రం లేద‌ని ష‌ర్మిల తెలిపారు.  గ‌త వారంలో 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు.  ఈ వారంలో రాజ‌కీయంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయ‌న్నారు.  కేసీఆర్ మ‌ళ్లీ సీఎం అయితే చాలా ఘోరాలు చూడాల్సి వ‌స్తుంద‌న్నారు.

ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం త‌న‌కు కొంచెం క‌ష్ట‌మే అనిపించినా త‌ప్ప‌లేద‌న్నారు. తాను త‌ప్పు చేసి వుంటే క్ష‌మించాల‌ని ఆమె కోరారు. తాను పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ప‌క్క‌నే నిల‌బ‌డ్డ పొంగులేటి శీన‌న్న‌ను పాలేరులో ఎలా ఓడించాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. గెలుపు గొప్ప‌దే అన్నారు. అంతేకంటే త్యాగం మ‌రింత గొప్ప‌ద‌ని ఆమె చెప్పుకొచ్చారు. 

పాలేరులో పోటీ చేస్తాన‌ని గ‌తంలో అక్క‌డ వైఎస్సార్‌టీపీ కార్యాల‌యాన్ని కూడా ష‌ర్మిల ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ష‌ర్మిల బ‌రి నుంచి త‌ప్పుకోవ‌డంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. వైఎస్సార్ అభిమానులు కాంగ్రెస్‌కే ఓటు వేస్తార‌ని ఆ పార్టీ నాయ‌కులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.