అగమ్యగోచరంగా షర్మిల పరిస్థితి!

కాంగ్రెసులో విలీనం కావాలని అనుకుంటున్న, అందుకోసం రెండు దఫాలు ఢిల్లీ పెద్దలతో మంతనాలు కూడా జరిపిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు.. వైఎస్ షర్మిల పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీనుంచి స్పందన లేదు. అదే…

కాంగ్రెసులో విలీనం కావాలని అనుకుంటున్న, అందుకోసం రెండు దఫాలు ఢిల్లీ పెద్దలతో మంతనాలు కూడా జరిపిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షరాలు.. వైఎస్ షర్మిల పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీనుంచి స్పందన లేదు. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ.. వామపక్షాలతో పొత్తు బంధాన్ని ఖరారు చేసుకుంది. 

సీట్లు ఏవి అనేది మాత్రమే ఖరారు కావాల్సి ఉంది. కానీ.. షర్మిల సంగతి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇంత జాగు జరిగినతర్వాత.. ఇంకా విలీనం ఉంటుందని అనుకోవడం కూడా భ్రమ అని పలువురు విశ్లేషిస్తున్నారు.

అయితే, విలీన ప్రక్రియ ఇలా స్తబ్ధంగా మారిపోవడానికి, షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎటూ కాకుండా పోవడానికి కారణం ఏమై ఉండచ్చా అనే విషయంలో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. 

ఒకటి- షర్మిల విలీనానికి ప్రతిగా తన పార్టీకి కోరే ఉపకారం, పొందదలచుకున్న సీట్ల విషయంలో గొంతెమ్మ కోరికలకు వెళ్లి ఉండాలి. 

రెండు- షర్మిల కాంగ్రెసులోకి రావడం ఓకే గానీ, ఆమె తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని.. పీసీసీ లోని కొందరు కీలక నాయకులు అడ్డు పడి ఉండాలి. ఈ రెండు కాంబినేషన్ల వల్ల మాత్రమే ఆమె పార్టీ విలీనం ఆగిపోయి ఉంటుందని పలువురుభావిస్తున్నారు.

విలీనం ఆగిపోయిన నేపథ్యంలో.. షర్మిల భవితవ్యం ఏమిటి? వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున ఆమె అసలు ఎన్నికల బరిలోకి దిగుతారా? లేదా? అనేదే పెద్ద ప్రశ్నార్థకం ఇప్పుడు. నిజం చెప్పాలంటే.. సొంతంగా బరిలోకి దిగే బలాన్ని, నైతిక స్థైర్యాన్ని షర్మిల ఎప్పుడో కోల్పోయారు. కాంగ్రెసులో విలీనం అనే వార్తలు రావడం, అందుకు సుముఖంగా ఆమె కొన్ని సార్లు ప్రతిస్పందించడం అనేది వైతెపాకు గొడ్డలిపెట్టులా మారాయి. 

సోనియా ఇంట్లో వారితో భేటీ కోసం వేచి ఉన్న సమయంలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉన్న వీడియోలు కూడా ఆమె స్థాయిని పలుచన చేశాయి. అయితే విలీనానికి సుముఖంగా ఆమెతోనే ప్రకటన చేయించి.. ఆ తర్వాత.. ఆ ప్రక్రియను అటకెక్కించడం ద్వారా, ఆమెను పట్టించుకోకపోవడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ.. ఒక అద్భుతమైన మైండ్ గేమ్ తో.. షర్మిల పార్టీని పాతాళానికి తొక్కేసిందా అనే అనుమానం కలుగుతోంది. రెడ్డి సామాజికవర్గంలో, వైఎస్సార్ తనయగా షర్మిలకు ఉండగల ఆదరణ మొత్తం పోయేలాగా.. ఈ మైండ్ గేమ్ తో కాంగ్రెస్ సక్సెస్ అయినట్టు భావించాలి.

అలాగే.. షర్మిల ఇప్పుడు విలీనం అయినా సరే.. ఆమె తనకు అంతో ఇంతో ప్రజాబలం తయారుచేసుకున్న పాలేరు నియోజకవర్గం దక్కుతుందనే గ్యారంటీ ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఆ సీటు కోసం ఇప్పటికే ఇద్దరు బలమైన నాయకులు కొట్టుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ పాలేరు కావాలని పోటీపడుతున్నారు. అది మిస్సయిన వారికి ఖమ్మం దక్కుతుంది. 

ఇలాంటప్పుడు మధ్యలో షర్మిల వచ్చినా ఆమెకు ఇస్తారనుకోవడం భ్రమ. ఏ రకంగా చూసినా సరే.. షర్మిల రాజకీయ జీవితం హఠాత్తుగా త్రశంకు స్వర్గంలో పడిపోయినట్టుగా కనిపిస్తోంది.