ప్రభుత్వ అధికారులంటే నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి ప్రతీకలుగా ప్రజలు భావిస్తారు. ప్రభుత్వం ఉద్యోగం అంటే ప్రజాసేవ చేసేందుకు దక్కిన అవకాశంగా భావించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే వేతనం, దానికి అదనంగా లంచాలు లాగొచ్చనే ఆలోచన వుంటుంది. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే గుణం ఉద్యోగుల్లో కొరవడింది.
ఉద్యోగుల అలసత్వానికి విసుగు చెందిన ఓ పౌరుడు వినూత్న రీతిలో నిరసన తెలిపి శభాష్ అనిపించుకున్నాడు. హైదరాబాద్‌లో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో ఇళ్లలోకి వరద నీరు, మురుగునీరు భారీగా చేరుతోంది. అల్వాల్ ప్రాంతంలో ఒక ఇంట్లోకి పాము వెళ్లింది. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురి అయ్యారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసి ఆరు గంటలు గడిచినా జీహెచ్ఎంసీ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అధికారుల నిర్లక్ష్యానికి విసుగెత్తిన సంపత్‌కుమార్ అనే బాధిత యువకుడు అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయానికి పామును తీసుకెళ్లాడు. ఆ కార్యాయంలోని అధికారి టేబుల్‌పై పాము విడిచిపెట్టి తన ఆగ్రహాన్ని, నిరసనను ప్రదర్శించాడు.
పామును చూసి జీహెచ్ఎంసీ అధికారులు భయపడ్డారు. పాము తమను ఏం చేస్తుందోనని బయటికి పరుగులు తీశారు. పాము ఇళ్లలోకి వస్తే…ప్రజల భయం ఎలా వుంటుందో అధికారుల అనుభవంలోకి తీసుకొచ్చేందుకు పామును తీసుకెళ్లి మరీ నిరసన తెలిపినట్టు సంపత్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.