కాంగ్రెస్ గెలిస్తే…ఏపీలో ఆ పార్టీకి సానుకూల‌మా?

తెలంగాణలో రాజ‌కీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. శుక్ర‌వారం నామినేషన్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు బీజేపీ ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌ని కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కూ అంతా అనుకున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు…

తెలంగాణలో రాజ‌కీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. శుక్ర‌వారం నామినేషన్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు బీజేపీ ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌ని కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కూ అంతా అనుకున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు వ‌చ్చింది. ఈ ఎన్నిక‌ల్లో సీమాంధ్రుల ఓట్లు కూడా కీల‌కం కానున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు సీమాంధ్రులు అండ‌గా నిలిచారు. దీంతో బీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ ద‌ఫా ప‌రిస్థితి అలా లేదు. గ‌తంలో రెండోసారి సీఎంగా ఎన్నికైన కేసీఆర్ ఆంధ్రా ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్‌కు స‌హాయ స‌హ‌కారాలు అందించార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది. అప్ప‌ట్లో తెలంగాణ‌లో టీడీపీ పోటీ చేయ‌డం, కేసీఆర్‌పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేయ‌డం  తెలిసిందే. గ‌తంలో చంద్ర‌బాబును సాకుగా చూపి ఎన్నిక‌ల్లో కేసీఆర్ భారీగా ల‌బ్ధి పొందారు. ఈ ద‌ఫా టీడీపీ తెలివిగా ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంది.

గ‌తంలో చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్‌కు, ఈ ద‌ఫా తాము కూడా అదే ఇస్తామ‌ని టీడీపీ అభిమానులు చెబుతున్నారు. కేసీఆర్ ఓట‌మితో ఏపీలో త‌మ పార్టీకి జోష్ వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌లు గ‌ట్టిగా చెబుతున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సీఎం అవుతార‌ని, అత‌ను త‌మ వాడేన‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌లో గెలిస్తే, ఆ ప్ర‌భావం ఏపీ ఎన్నిక‌ల‌పై త‌ప్ప‌క ప‌డుతుంద‌ని టీడీపీ నేత‌లు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ గెలుపు టీడీపీకి త‌ప్ప‌క సానుకూల వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేస్తుంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

అందుకే వైసీపీ నుంచి త‌మ పార్టీలోకి చేరిక‌ల‌ను తెలంగాణ ఎన్నిక‌ల త‌ర్వాత చేప‌ట్టాల‌ని టీడీపీ నేత‌లు నిర్ణ‌యించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలుపు, ఏపీలో రాజ‌కీయ మ‌లుపున‌కు దారి తీస్తుంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో టీడీపీలోకి వ‌ల‌స‌లు వెల్లువెత్తుతాయ‌ని ఆ పార్టీ నాయ‌కులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ర‌కు వేచి చూడాల‌నే ధోర‌ణిలో టీడీపీ ముఖ్య నేత‌లు ఉన్నారు.