తెలంగాణ‌లో టీడీపీ, జ‌న‌సేన స‌ర్క‌స్ ఫీట్లు చూడ‌త‌ర‌మా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్ర‌విచిత్రాల‌ను చూస్తున్నాం. మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన పార్టీలు స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నాయి. తెలంగాణ ఎన్నిక‌ల బ‌రి నుంచి టీడీపీ త‌ప్పుకుంది. కానీ ఏపీలో ఆ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్ర‌విచిత్రాల‌ను చూస్తున్నాం. మ‌రీ ముఖ్యంగా టీడీపీ, జ‌న‌సేన పార్టీలు స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నాయి. తెలంగాణ ఎన్నిక‌ల బ‌రి నుంచి టీడీపీ త‌ప్పుకుంది. కానీ ఏపీలో ఆ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన పోటీ చేస్తోంది. తెలంగాణ‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 సీట్ల‌లో జ‌న‌సేన నిలిచింది. ఇదో విచిత్ర ప‌రిణామం.

తెలంగాణ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకున్నామ‌ని ప్ర‌క‌టించిన టీడీపీ, ఆచ‌ర‌ణకు వ‌స్తే యాక్టీవ్‌గా ప‌ని చేస్తోంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తోంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌స్తే, ఆయ‌న స‌భ‌ల్లో తెలుగుదేశం జెండాలు రెప‌రెప‌లాడ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్య‌ర్థులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, భ‌ట్టి విక్ర‌మార్క‌కు మ‌ద్ద‌తుగా టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌చారం చేయ‌డం విశేషం. ఇదే జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే, బీజేపీతో అధికారికంగా పొత్తులో వుండి కూడా క‌లిసి ప్ర‌చారం చేస్తున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఈ నెల 26న అమిత్‌షాతో క‌లిసి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌భ‌లో పాల్గొంటార‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

పొత్తులో ఉన్న బీజేపీ, జ‌న‌సేన‌లు మాత్రం అస‌లు ఎన్నిక‌ల‌తో సంబంధం లేద‌న్న‌ట్టు క్షేత్ర‌స్థాయిలో క‌లిసి ప‌ని చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పొత్తులో లేని టీడీపీ, కాంగ్రెస్ మాత్రం పాలునీళ్ల‌లా క‌లిసి…బీఆర్ఎస్‌ను గ‌ద్దె దించేందుకు శ్ర‌మిస్తున్నాయి. కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన టీడీపీ… అధికారికంగా తెలంగాణ‌లో అస్త్ర స‌న్యాసం చేసిన‌ప్ప‌టికీ, చివ‌రికి అదే పార్టీకి అధికారం వ‌చ్చేందుకు ప‌నిచేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.