స్వ‌కులం ఒత్తిడికి త‌లొగ్గిన బాబు!

టీడీపీ కంటే సొంత కుల‌మో ఎక్కువ‌ని చంద్ర‌బాబు నిరూపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోవాల‌ని టీడీపీ ఎట్ట‌కేల‌కు నిర్ణ‌యించుకుంది. చంద్ర‌బాబుతో ములాఖ‌త్ తర్వాత మీడియాతో టీటీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ చెప్పిన…

టీడీపీ కంటే సొంత కుల‌మో ఎక్కువ‌ని చంద్ర‌బాబు నిరూపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోవాల‌ని టీడీపీ ఎట్ట‌కేల‌కు నిర్ణ‌యించుకుంది. చంద్ర‌బాబుతో ములాఖ‌త్ తర్వాత మీడియాతో టీటీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ చెప్పిన విష‌యాల‌న్నీ ప్ర‌గ‌ల్భాలే త‌ప్ప‌, వాస్త‌వాలు లేవ‌ని తేలిపోయింది. తెలంగాణ‌లో పోటీ చేయ‌క‌పోవ‌డానికి టీడీపీ పైకి చెబుతున్న కార‌ణాల‌కు, వాస్త‌వాల‌కు పొంత‌నే లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు అరెస్ట్‌, వైసీపీ ప్ర‌భుత్వంపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న క్ర‌మంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దృష్టి సారించ‌లేమ‌ని టీడీపీ అధిష్టానం స్ప‌ష్టం చేసింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో మొక్కుబ‌డిగా పోటీ చేసి, ఘోర ప‌రాజ‌యం పాలైతే, ఆ ప్ర‌భావం ఏపీపై ప‌డుతుంద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

ఇదిలా వుండ‌గా తెలంగాణ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టీడీపీ పోటీ చేయ‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబుపై ఆయ‌న సామాజిక వ‌ర్గం నేత‌లు తీవ్ర ఒత్తిడి చేయ‌డం గురించి తెలిసిందే. ఒక‌వేళ టీడీపీ పోటీ చేస్తే ఓట్ల చీలిక జ‌రిగి బీఆర్ఎస్‌, బీజేపీ ల‌బ్ధి పొందుతాయ‌ని బాబుకు వారు వివ‌రించారు. టీకాంగ్రెస్ అధ్య‌క్షుడైన రేవంత్‌రెడ్డి త‌మ వాడేన‌ని, కాంగ్రెస్‌కు ఓట్లు వేయ‌డం ద్వారా అత‌న్ని సీఎం చేసుకునే అవ‌కాశం వుంద‌ని బాబుకు క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌లు వివ‌రించారు.

గ‌తంలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని, ఆ త‌ర్వాత కాంగ్రెస్ పంచ‌న చేరార‌ని, అత‌ని రుణం తీర్చుకోడానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని చంద్ర‌బాబు భావించిన‌ట్టుగా క‌మ్మ సామాజిక వ‌ర్గ నేత‌లు చెబుతున్నారు. ఈ ఎన్నిక‌ల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌లో టీడీపీకి గెలిచే అవ‌కాశాలు లేన‌ప్పుడు పోటీ చేయ‌డం ద్వారా కాంగ్రెస్‌కు న‌ష్టం చేసిన‌ట్టు అవుతుంద‌ని బాబుకు వివ‌రించారు. చివ‌రికి త‌న సామాజిక వ‌ర్గం ఒత్తిడికి త‌లొగ్గి తెలంగాణ‌లో టీడీపీకి శాశ్వితంగా స‌మాధి క‌ట్ట‌డానికి చంద్ర‌బాబు అంగీక‌రించిన‌ట్టైంది.