బీజేపీ సామూహిక ఆత్మ‌హ‌త్య‌

రాజ‌కీయాల్లో స‌హ‌జ మ‌ర‌ణాలుండ‌వు. ఆత్మ‌హ‌త్య‌లే వుంటాయి. అయితే భార‌తీయ జ‌న‌తాపార్టీ దీనికి విరుద్ధంగా ఇప్ప‌టి వ‌ర‌కూ హ‌త్య‌లు చేస్తూ వ‌చ్చింది. అనేక రాష్ట్రాల్లో పార్టీల‌ని ఫినిష్ చేస్తూ వ‌చ్చింది. కాంగ్రెస్ క‌ల్చ‌ర్ అది. దాన్ని…

రాజ‌కీయాల్లో స‌హ‌జ మ‌ర‌ణాలుండ‌వు. ఆత్మ‌హ‌త్య‌లే వుంటాయి. అయితే భార‌తీయ జ‌న‌తాపార్టీ దీనికి విరుద్ధంగా ఇప్ప‌టి వ‌ర‌కూ హ‌త్య‌లు చేస్తూ వ‌చ్చింది. అనేక రాష్ట్రాల్లో పార్టీల‌ని ఫినిష్ చేస్తూ వ‌చ్చింది. కాంగ్రెస్ క‌ల్చ‌ర్ అది. దాన్ని య‌ధాత‌థంగా అందిపుచ్చుకుని జ‌నం తీర్పుతో గెలిచిన పార్టీల‌ని చీల్చి, చ‌క్రం తిప్పింది. క‌ర్నాట‌క‌లో ఓడిపోయే స‌రికి క‌ళ్లు బైర్లు క‌మ్మి తెలివి తెచ్చుకుంటుంద‌ని అనుకుంటే పార్టీ బ‌తికింది అనుకునే తెలంగాణ‌లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.

కేసీఆర్‌ని గ‌ట్టిగా ఎదుర్కొనేది బండి సంజ‌య్ ఒక‌డే అనుకుంటున్న ద‌శ‌లో కిష‌న్‌రెడ్డిని తెచ్చింది. రేస్ గుర్రాన్ని ప‌క్క‌న పెట్టి ఎద్దుని తెచ్చి క‌ట్టింది. దానికి ప‌రిగెత్త‌డం తెలియ‌దు. త‌న్న‌డం అస‌లే రాదు. గ‌త ఎన్నిక‌ల్లో పూర్తిగా మునిగిపోయిన బీజేపీకి మ‌ళ్లీ ప్రాణం పోసింది సంజ‌య్‌. కొన్నిసార్లు అతిగా వ్య‌వ‌హ‌రించొచ్చు. ఇష్ట‌మొచ్చింది మాట్లాడి ఉండొచ్చు. అయితే కేసీఆర్ వాగ్దాటిని త‌ట్టుకోవాలంటే ఆ మాత్రం వుండాలి. 

కాంగ్రెస్‌కి ఓటు వేస్తే అమ్ముడుపోతార‌ని జ‌నం న‌మ్మ‌డం వ‌ల్ల టీఆర్ఎస్‌కి (ఇప్పుడు బీఆర్ఎస్‌, ఇక‌పైన కేసీఆర్ ఇత‌ర రాష్ట్రాల్లో కాలు పెట్టక‌పోవ‌చ్చు) ప్ర‌త్యామ్నాయం బీజేపీ అని న‌మ్మి ఓటు వేశారు. పార్టీ కేడ‌ర్ కూడా ఉత్సాహంగా బండి సంజ‌య్ వెంట న‌డిచింది. కార్య‌క‌ర్త‌లు దెబ్బ‌లు తిన్నారు, జైళ్ల‌కు వెళ్లారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ నాయ‌కుల‌కి తొడ‌లు కొట్టారు. ఇప్పుడు వాళ్ల‌ ప‌రిస్థితి ఏంటి?

కేసీఆర్‌తో బీజేపీకి ఒప్పందం కుదిరింద‌ని ఇపుడు జ‌నం గాఢంగా న‌మ్ముతున్నారు. జీవం పోసుకుని లేచి నిల‌బెడుతున్న పార్టీని కేసీఆర్ కోసం తెగ‌న‌ర‌క‌డం ఆత్మ‌హ‌త్య కాకుండా మ‌రేంటి? చ‌చ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని ఓట‌మి భ‌యంతో బీజేపీ బ‌తికిస్తోంది. 

ఇపుడు తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డిని న‌మ్ముతారు త‌ప్ప కిష‌న్‌రెడ్డిని కాదు. మెత్త‌గా మాట్లాడేవాడు జ‌నానికి అవ‌స‌రం లేదు. కేసీఆర్‌తో తెగ‌బ‌డి పోరాడే వాడు అవ‌స‌రం. కిందిస్థాయిలో చొక్కాలు చింపుకునే వాళ్ల‌కి ఇదో హెచ్చ‌రిక‌. పైవాళ్లు ఎప్పుడైనా క‌లిసిపోతారు. కార్య‌క‌ర్త‌ల‌కి మిగిలేది జైలు, కేసులు, అవ‌మానాలు మాత్ర‌మే.