చివరిదాకా నిరీక్షణే.. తేల్చేసిన్ కిషన్ రెడ్డి!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి.. అభ్యర్తులను ప్రకటించే సత్తా లేదు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లోనే గెలిచి అధికారంలోకి వస్తాం అని పదేపదే విర్రవీగిన ఈ పార్టీ తీరా ఎన్నికలు వచ్చేసరికి.. నీళ్లు…

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి.. అభ్యర్తులను ప్రకటించే సత్తా లేదు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లోనే గెలిచి అధికారంలోకి వస్తాం అని పదేపదే విర్రవీగిన ఈ పార్టీ తీరా ఎన్నికలు వచ్చేసరికి.. నీళ్లు నములుతోంది. కనీసం 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించగల స్థితిలో పార్టీ ఉన్నదా లేదా అనేదే పెద్ద మీమాంస. 

గులాబీదళం ఎటూ అభ్యర్థులను ప్రకటించేసింది. కాంగ్రెసు కూడా తుది కసరత్తులు చేస్తోంది. రేపో మాపో అక్కడి అభ్యర్థుల జాబితా కూడా వచ్చేస్తుంది. ఆ పర్వం పూర్తయిన తర్వాత.. ఆయా పార్టీల్లోని అసంతృప్తులందరూ లెక్కతేలి.. కమలదళంలోకి ఫిరాయించి వచ్చే బలమైన వారెవ్వరో తేలిన తర్వాత గానీ, తమ జాబితా ప్రకటించే ఉద్దేశం వారికి లేదు. అయితే కిషన్ రెడ్డి ఈ బలహీనతకు చాలా అందమైన ముసుగు తొడుగుతున్నారు.

అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది పూర్తిగా తమ ఇష్టం అని, ఎన్నికల వ్యూహంలో భాగంగానే అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటిస్తున్నామని ఆయన అంటున్నారు. నామినేషన్ చివరి వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పడం గమనిస్తే.. నామినేషన్ లు వేసే చివరి గడువు దాకా.. ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చే వారికోసం బిజెపి ఎదురుచూస్తూనే గడిపేయబోతోందని క్లియర్ గా అర్థమవుతోంది. 

చివరి వరకు అభ్యర్థులను ప్రకటించవచ్చు అనేది టెక్నికల్ గా నిజమే. కానీ.. పార్టీలు గతిలేని సందర్భాల్లోనూ.. ఒక సీటు కోసం అనేకమంది కీలక నాయకులు హోరాహోరీగా ప్రయత్నిస్తున్న సమయంలోనూ మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకటి- ప్రతిచోటా సరైన అభ్యర్థి లేని బలహీనత కాగా, రెండోది- ఫిరాయించి వచ్చే వారికోసం ఎదురుచూసే కారణాలతో.. గత ఎన్నికల సమయంలో కూడా బిజెపి ఇలాంటి దుర్మార్గమైన పోకడ అనుసరించింది. ప్రచారానికి కేవలం రెండు వారాల కంటె తక్కువ వ్యవధి ఉండేలా కొందరు అభ్యర్థుల పేర్లను తేల్చింది.

వారు ప్రచారానికి చాలినంత సమయం లేక.. తూతూ మంత్రంగా ప్రచారం నడిపించారు. అప్పటికీ పార్టీకి ఉన్న ఆదరణతో సుమారు 40వేల ఓట్ల వరకు తెచ్చుకుని ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి అభ్యర్థుల పేర్లను సకాలంలో ప్రకటించి ఉంటే గనుక.. వారికి ప్రచారానికి సరైన వ్యవధి ఉండేలా చూసి ఉంటే గనుక.. భాజపా కొన్ని చోట్ల మరింత గౌరవప్రదమైన ఓట్లు సంపాదించుకుని ఉండేది. కిషన్ రెడ్డి తన మాటల గారడీతో విర్రవీగకుండా.. సకాలంలో అభ్యర్థులను తేల్చాలనే డిమాండ్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.