తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఇవాళ ట్వీట్టర్ వేదికగా స్పందించారు గవర్నర్ తమిళిసై. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరే ఉందని గుర్తుచేస్తూ.. సీఎస్ శాంతికుమారిపై విమర్శలు కురిపించారు.
ప్రియమైన సీఎస్ గారు.. 'రాజ్‌భవన్ ఢిల్లీ కంటే మీకు సమీపంలోనే ఉంది. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అధికారికంగా రాజ్‌భవన్‌ని సందర్శించడానికి మీకు సమయం దొరకలేదు. ప్రోటోకాల్ పాటించడం లేదు! మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నా ఢిల్లీ కంటే రాజ్‌భవన్ మీకు సమీపంలో ఉందని' ట్వీట్ చేశారు.
ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా.. పెండింగ్ లో పెట్టారని.. బిల్లుల ఆమోదం కోసం ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్ ఇస్తూ.. బిల్లులు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించటానికి కనీసం ఒక్కసారి కూడా వచ్చి కలవలేదని, దాని కోసం కనీసం ఫోన్ కూడా చేయలేదని విషయాన్ని గుర్తు చేస్తునే.. చర్చల ద్వారా పరిష్కారం వస్తుందని చెబుతూ కోర్టులో రిట్ పిటీషన్ వేయటాన్ని ఎత్తిచూపారు.
బహుశా సీఎస్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో చర్చిస్తే పరిష్కారం దొరకవచ్చని భావిస్తున్నారు అధికారులు. సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రిట్ పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది.