హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం.. రేవంత్ పూనిక!

తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం ఇవ్వడం అంటే, తెలుగుదేశానికి రేవంత్ రుణం తీర్చుకోవడమే

ఎంతైనా రేవంత్ రెడ్డిలో అంతో ఇంతో తెలుగుదేశం రక్తం ఉండకుండా పోదు. తెలుగుదేశం పార్టీలోనే తన సుదీర్ఘ రాజకీయ కెరీర్‌ను పటిష్ఠంగా నిర్మించుకున్న వ్యక్తి ఆయన. చంద్రబాబునాయుడు తనకు రాజకీయ గురువు అని ఒప్పుకుంటారు, ఆయనపై పల్లెత్తు మాట కూడా అనరు.

ఈ ప్రేమ వలన తెలుగుదేశం పార్టీకి ఆయన రుణం తీర్చుకోలేకపోయినా, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కోసం పార్టీ రహిత ముసుగుతో ఓ భారీ కార్యక్రమానికి సహకరించబోతున్నారు. హైదరాబాదులో అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో ఎన్టీఆర్ 100 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి స్థలం కేటాయిస్తానని రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.

ప్రభుత్వం కేటాయించే స్థలంలో 100 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహం మాత్రమే కాదు, ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని పర్యాటక కేంద్రంలా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనతో ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, కమిటీ సభ్యుడు మధుసూదన రాజు రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. వారిని ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఇప్పటి ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం వద్దకు తీసుకెళ్లారు. చివరికి స్థల కేటాయింపునకు సీఎం ఓకే అనడం జరిగింది.

ఇందులో కొన్ని అంశాలను గమనించాల్సి ఉంది. ఇలాంటి విగ్రహం ఏర్పాటు చేయదలచుకుంటే, ప్రభుత్వమే స్థలం కేటాయించాలని విన్నవించుకోవాల్సి ఉండగా, ఎన్టీఆర్ కుటుంబం కమిటీలు ఉండటమా? లేదా, తాము ఒక స్థలాన్ని ఎంపిక చేసుకుని దానిని ప్రభుత్వం తమకు విక్రయించమని అడిగితే మరింత మర్యాదగా ఉండేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎన్టీఆర్‌ను ఆంధ్ర ప్రదేశ్ నాయకుడిగానే ఇక్కడి ప్రజలు, నాయకులు చూశారు. అయితే, నగరంలో ఇప్పటివరకు ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించడం వంటి చర్యలు జరగలేదు. అంతవరకు తెలంగాణ సమాజం ఎన్టీఆర్ సేవలను గౌరవిస్తూ సంయమనం పాటించింది.

కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత, ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం ఇవ్వడం అంటే, తెలుగుదేశానికి రేవంత్ రుణం తీర్చుకోవడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

8 Replies to “హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం.. రేవంత్ పూనిక!”

  1. 2026 లో GHMC ఎన్నికల కోసమేనా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవన్నీ చేస్తున్నది?

  2. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరి వాడు. తెదేపాకో ఒక వర్గానికో పరిమితం చేయడం సరికాదు

Comments are closed.