సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ కోర్టు ఖర్చులకు ప్రభుత్వ సొమ్మును వాడుకోవడంపై తెలంగాణ హైకోర్టు అభ్యంతరం చెప్పింది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 లక్షలను తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. దీంతో తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టైంది. స్మిత కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2015, జూన్ 18న హైదరాబాద్‌లో స్మితా సబర్వాల్ తన భర్తతో కలిసి ర్యాంప్ షో చేశారు. దీనిపై ఔట్‌లుక్ ఆంగ్ల వీక్లీ ‘నో బోరింగ్ బాబు’ శీర్సికతో వ్యాసాన్ని, క్యారికేచర్‌ను ప్రచురించింది. ఔట్‌లుక్ పత్రికపై స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పత్రికపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేసేందుకు నిధులు విడుదల చేయాలని స్మితా సబర్వాల్ కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆమె కోరినట్టే ప్రభుత్వం రూ.15 లక్షలు విడుదల చేసింది.
అయితే స్మితా సబర్వాల్ ఎదుర్కొంటున్న వ్యక్తిగత కేసుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. స్మితా ప్రైవేట్ వ్యాజ్యానికి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ వి.విద్యాసాగర్, కె.ఈశ్వర్‌రావులతో పాటు ఔట్‌లుక్ తరపున హైకోర్టులో వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర, జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ జరిపింది.
ఒక ఉన్నతాధికారి తన పరువుకు భంగం కలిగిందని సివిల్ దావా దాఖలు చేస్తే, అందుకయ్యే ఖర్చులకు ప్రభుత్వం నిధులు ఇవ్వొచ్చా? అది కూడా వ్యక్తిగత వ్యవహారమని, విధుల్లో లేనప్పుడు తలెత్తిన వివాదానికి ప్రభుత్వం ఖర్చు పెట్టవచ్చా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల ప్రకారం అధికారులకు న్యాయ సహాయం చేయవచ్చని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం ఉద్యోగ విధుల్లో భాగంగా తలెత్తే వివాదాలకు మాత్రమే సహాయం చేయాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన రూ.15 లక్షల నిధులు ప్రజాప్రయోజనం కోసం మంజూరు చేసిన నిధుల కిందికి రావని స్పష్టం చేసింది. రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని స్మితా సబర్వాల్‌కు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఈ మొత్తాన్ని 90 రోజుల్లో ప్రభుత్వా నికి చెల్లించాలని ఆదేశించింది. స్మితా సబర్వాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారి కావడంతో ఆమెకు సంబంధించిన తీర్పు చర్చనీయాంశమైంది.
కేవలం సీఎం కేసీఆర్ కార్యాలయంలో పనిచేసే ముఖ్య ఐఏఎస్ అధికారి అనే కారణంతో ఆమె వ్యక్తిగత కేసుకు సంబంధించిన కేసు కోర్టు ఖర్చులకు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం ఏంటనే నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి.