పిటిష‌న‌ర్‌లో నిజాయితీ లేదు…వ్యాజ్యాన్ని విచారించ‌లేం

బిగ్‌బాస్ రియాల్టీ షోపై దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది. పిటిష‌న‌ర్ నిజాయితీగా వ్య‌వ‌హ‌రించ‌ని కార‌ణంగా, వ్యాజ్యాన్ని విచారించ‌బోమ‌ని తేల్చి చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా ధ‌ర్మాసనం…

బిగ్‌బాస్ రియాల్టీ షోపై దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది. పిటిష‌న‌ర్ నిజాయితీగా వ్య‌వ‌హ‌రించ‌ని కార‌ణంగా, వ్యాజ్యాన్ని విచారించ‌బోమ‌ని తేల్చి చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా ధ‌ర్మాసనం రియాల్టీ షోపై ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. బిగ్‌బాస్ రియాల్టీ షో విశేష ప్రాచుర్యం పొందిన కార్య‌క్ర‌మం కావ‌డం, దానిపై న్యాయ‌స్థానం ఏం చెబుతుందోన‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఏకంగా 24 గంట‌లూ ఓటీటీ వేదిక‌గా రియాల్టీ షో ప్ర‌సార‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. సెన్సార్‌షిప్‌లేని బిగ్‌బాస్‌ వంటి రియాల్టీ షో కార్యక్రమాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, డ‌బ్బు సంపాద‌నే ధ్యేయంగా ప్రసారమవుతున్న వీటిని అడ్డుకోవాల‌ని కోరుతూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఆల‌స్యంగా విచార‌ణ‌కు నోచుకుంది.  

న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి ధర్మాసనం విచార‌ణ చేప‌ట్టింది. బిగ్‌బాస్‌ వంటి షోల్లో హింస, అశ్లీలత తప్ప ఏమున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. రియాల్టీ షోల పేరుతో ఏది పడితే అది చూపిస్తామంటే కళ్లు మూసు కుని ఉండలేమని ధ‌ర్మాస‌నం స్పష్టం చేసింది. బిగ్‌బాస్‌ షోలో ఏం చూపిస్తున్నారో అందరికీ తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇదే సంద‌ర్భంలో బిగ్‌బాస్‌ షోను ఆపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తర్వాత విచారిస్తామ‌ని సీజే ధర్మాసనం వాయిదా వేసిన విషయాన్ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది దాచి పెట్ట‌డంపై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

ఈ విషయాన్ని నిజాయితీగా తమకు తెలియచేసి ఉంటే ఈ వ్యాజ్యాన్ని విచారించేవాళ్లమని, అలా చెప్పకుండా దాచిపెట్టిన కార‌ణంగా విచారణ జరపబోమని తేల్చి చెప్పింది. సీజే ధర్మాసనం వద్దే ఈ వ్యాజ్యం గురించి తేల్చుకోవాల‌ని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.