తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి.. ఉచ్చు బిగించడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ముక్కలు చేసేయడం వలన అసలు ఆధారాలు దొరికే అవకాశం తగ్గిపోయింది.
పోలీసులనే సాక్షులుగా చేరుస్తూ విచారణ సాగిస్తున్న అధికారులు, వాంగ్మూలాలను ఆధారాలుగా నమోదు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విచారణలో సాక్షులు చెప్పే వాంగ్మూలాలు ఆధారాలుగా సరిపోతాయా? అనేది ప్రశ్న. వాంగ్మూలాల్లోని విషయాలను నిరూపించే ఇతర ఆధారాలను సేకరిస్తే తప్ప ఈ ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారులు వెలుగులోకి రావడం కష్టం.
పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి.. అధికారులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల హవా నడిచినప్పుడు వారి ఆదేశాల మేరకు కిందిస్థాయి సిబ్బందిలో చాలా మంది వారు చెప్పిన పనులన్నీ చేశారు. ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన డబ్బు తరలింపు జరుగుతున్న సందర్భాల్లో దాన్ని పట్టుకోవడానికి ప్రధానంగా ట్యాపింగ్ ను వినియోగించినట్టుగా తేలుస్తున్నారు.
ఇలా 8 సందర్భాల్లో పదిన్నర కోట్లదాకా ప్రత్యర్థి పార్టీల వారి డబ్బును పట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆయా ఆపరేషన్లలో పాల్గొన్న వాళ్లు, దానితో సంబంధం ఉన్నవాళ్లు ఇలా మొత్తం 35 మంది నుంచి విచారణలో వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ వాంగ్మూలాలు రాధాకిషన్, ప్రభాకర్ రావు తదితరుల పాత్రలను గురించి చెప్పేవి గానే ఉన్నాయి. పోలీసులనే సాక్షులుగానే చూపించే ఆలోచన జరుగుతోంది.
ఇదంతా బాగానే ఉంది. అయితే.. ట్యాపింగ్ చేయించిన అసలు సూత్రధారులు ఎవరు? అనే విషయం నిరూపిచండానికి ఈ వాంగ్మూలాలు సరిపోతాయా? అనేది టెక్నికల్ సందేహం. ఉదాహరణకు పోలీసులు విచారించిన వారందరూ కూడా.. రాధాకిషన్, ప్రభాకర్ రావు వంటి తమ పై అధికారుల స్థాయి వరకు తమతో ఆ పనిచేయించింది ఎవరో చెప్పగలరు. ఆ స్థాయి వారిని విచారిస్తే వారు అప్పటి అధికార పార్టీ భారాసలో తమను పురమాయించిన రాజకీయ పెద్దలెవరో పేర్లు చెప్పగలరు.
కానీ కేవలం ‘వారు చెప్పడం’ మీద ఆధారపడి.. ఆయా నాయకుల్ని కటకటాల వెనక్కు పంపడం సాధ్యం అవుతుందా? పేర్లు చెప్పేస్తే సరిపోదు.. నిజంగానే ఆ నాయకులు చెప్పినట్టుగా, వారికి ట్యాపింగ్ చేసిన సమాచారం చేరినట్టుగా ఆధారాలను పోలీసులు సంపాదించాలి. లేకపోతే.. కేవలం నాయకులు చెప్పినట్టల్లా ఆడినందుకు పోలీసులు మాత్రం కటకటాల వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది. అసలు దోషులు, అనగా తెరవెనుక నుంచి ఇలాంటి కుట్ర, కుటిల రాజకీయాన్ని నడిపించిన వాళ్లు క్షేమంగా , హాయిగా తాను కడిగిన ముత్యాన్ని అని చెప్పుకుంటూ బతికేస్తుంటారు.