అబ్బాయి-అమ్మాయి సవ్యంగా ప్రేమించుకున్నా, జీవితంలో సెటిలై పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా పెద్దలు ఒప్పుకోని పరిస్థితి. అలాంటిది అమ్మాయి-ట్రాన్స్ జెండర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటామంటే సమాజం ఊరుకుంటుందా..? కేంద్రం కూడా అలాంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పించలేమంటూ ఇటీవలే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇద్దరు అమ్మాయిల లవ్ స్టోరీ విషాదాంతంగా మారింది. ఆత్మహత్యకు ప్రయత్నించారా, లేక ఎవరైనా దాడి చేశారా.. అనేది తెలియదు కానీ, ఒకరు చనిపోగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో మహేశ్వరి, అంజలి కుటుంబాలు ఉండేవి. బంధువులే కావడంతో తరచూ వారిద్దరూ కలుస్తుండేవారు. మహేశ్వరి ట్రాన్స్ జెండర్ కావడంతో మగపిల్లల లాగా దుస్తులు ధరించేది. అబ్బాయిల్లాగానే ప్రవర్తించేది. అంజలికి మహేశ్వరిపై అభిమానం కాస్తా ప్రేమగా మారింది.
ఇద్దరూ పెద్దలను ఎదిరించి ఓ రూమ్ అద్దెకు తీసుకుని కలసి ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే ఉన్నట్టుండి రాత్రి రామకృష్ణాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో స్థానికులకు కనపడ్డారు. ఆస్పత్రికి తరలించిన తర్వాత అంజలి చనిపోయింది. మహేశ్వరి ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
అసలేం జరిగింది..?
ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అయితే ఇటీవల పెళ్లి విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని ఆరోపిస్తున్నారు అంజలి తల్లిదండ్రులు. అంజలిని గొంతుకోసి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల తరచూ గొడవలు పడుతున్నారని, మరో ఇద్దరు వ్యక్తులు వీరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఆ ఇద్దరు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంజలిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.