టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి భారతీయ జనతా పార్టీ తరఫున కొందరు నిజంగానే ప్రయత్నించారా? లేదా, కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వయంగా కొందరిని పురమాయించి, తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బేరగాళ్ల లాగా హైదరాబాదుకు రమ్మని.. ఆ పని బిజెపి చేయమన్నట్లుగా ప్రచారం చేయాలని.. స్క్రిప్ట్ ప్రకారం ఈ కథను నడిపిస్తున్నారా? అనేవి అర్థం కాని సంగతులు.
కానీ మునుగోడు ఎన్నిక సమయంలో ఈ వ్యవహారం బయటకు రావడం వలన దీనికి కాస్త ప్రాధాన్యం పెరిగింది. ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే మనం కీలకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘ఎమ్మెల్యేల బేరం’ అనే ఎపిసోడ్ ప్రభావం మునుగోడు ఎన్నిక మీద ఉంటుందా? లేదా?
ప్రజలు పార్టీల రాజకీయ భావజాలాలను, సిద్ధాంతాలను అధ్యయనం చేసి.. వారి చిత్తశుద్ధిని, నిష్కళంకతను తూకం వేసి.. ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు ఉన్నదా? ప్రజలు అలాంటి ఆలోచన సరళితో ఉన్నారా? అనేవి మన మదిలో మెదిలే ప్రశ్నలు. ఎందుకంటే ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి మరే ఇతర పార్టీలోకి ఫిరాయించినప్పటికీ… ‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఆ పని చేశానని’ బుకాయించే ప్రయత్నాలు చేసినప్పటికీ.. వాస్తవంలో అవన్నీ స్వార్ధపూరిత ఫిరాయింపులే అనే సంగతి ప్రజలకు తెలుసు.
ప్రలోభాలు, తాయిలాలు, కాంట్రాక్టులు లాంటి స్వప్రయోజనాలను ఆశిస్తూ మాత్రమే నాయకులు పార్టీలు మారుతున్నారు తప్ప ఆయా పార్టీల సిద్ధాంతాలను నచ్చి గాని.. వారు చెబుతున్నట్టుగా నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి మాత్రం గానీ అనుకోవడానికి వీల్లేదు. ఈ విషయంలో ప్రజలకు చాలా స్పష్టత ఉంది.
ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా దానికి ఏదో ఒక ప్రత్యేకమైన బేరం ఉంటుందని వాళ్ళు గుర్తిస్తారు. ఆ బేరాలు తప్పు అని.. బేరాలకు పాల్పడే రాజకీయ పార్టీలు దుర్మార్గమైనవి దూరం పెట్టవలసినవి అని గాని తర్కించేంత ఓపిక ప్రజలకు లేదు. కాబట్టి నలుగురు ఎమ్మెల్యేల కోసం బిజెపి బేరమాడినట్టుగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఎపిసోడ్.. అచ్చంగా మునుగోడు ఉపఎన్నిక మీద ప్రభావం చూపిస్తుంది అనుకోవడం భ్రమ.
ప్రధానంగా స్థానిక సమస్యలు.. ఆ సమస్యలను పరిష్కరించడంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల చిత్తశుద్ధి మీద విశ్వాసం.. పార్టీలు వల్లె వేసే వాగ్దానాల పట్ల నమ్మకం మాత్రమే విజయాన్ని నిర్దేశిస్తాయి. అంతే తప్ప సంతలో ఎద్దుల బేరం లాగా.. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కోసం జరిగే బేరసారాలు సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తాయని అనుకోలేం.