X దాటి పబ్లిక్ లోకి వస్తేకదా రాములమ్మా!

కాంగ్రెసు పార్టీ అమ్ముల పొదిలో చేరిన కొత్త అస్త్రం రాములమ్మ విజయశాంతి. కానీ, ఆ అస్త్రం ఆ పార్టీకి ఎంతమేరకు ఉపయోగపడుతున్నది? అసలు ఉపయోగించుకునే ఉద్దేశం ఆ పార్టీకైనా ఉన్నదా లేదా? అనే చర్చ…

కాంగ్రెసు పార్టీ అమ్ముల పొదిలో చేరిన కొత్త అస్త్రం రాములమ్మ విజయశాంతి. కానీ, ఆ అస్త్రం ఆ పార్టీకి ఎంతమేరకు ఉపయోగపడుతున్నది? అసలు ఉపయోగించుకునే ఉద్దేశం ఆ పార్టీకైనా ఉన్నదా లేదా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

ఎన్నికల సీజను బాగా కాకమీదకు చేరుకున్న తర్వాత.. విజయశాంతి బిజెపి నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించారు. నిజానికి ఆమె చాన్నాళ్లుగా అసంతృప్తితోనే ఉన్నప్పటికీ, భాజపా తనకు అప్పగించిన పనుల పట్ల విముఖంగానే ఉంటున్నప్పటికీ.. అంటీముట్టనట్టుగా ఉన్నప్పటికీ.. ఆమె పార్టీ మారడం అనేది ఆ సమయంలో ఊహించినది కాదు. అయితే బిజెపి మీద విమర్శలు కురిపించడంలో కాంగ్రెసు పార్టీకి ఆమె ఉపయోగపడుతున్నదా? లేదా? అనేది ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది.

పార్టీ మారినప్పడు చాలా సహజంగానే విమర్శించేవారు, హర్షించేవారు ఉంటారు. విజయశాంతికి కూడా అలాంటి మిశ్రమ ప్రతిస్పందనలు ఎదురవుతున్నాయి. విమర్శలకు ఆమె తాజాగా ట్విటర్ (X) కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెసులోకి ఎందుకువెళ్లాల్సి వచ్చిందో ఆమె చెప్పుకొచ్చారు.

కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడు సంవత్సరాల పాటు జెండా మోసి కొట్లాడింది తానేనని, అప్పట్లో బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి వాళ్లు అనేకమార్లు తన వద్దకు వచ్చి.. భారాస అవినీతిపై చర్యలుంటాయని చెప్పారని, సమర్థించాలని కోరారని.. వారు అలా చెప్పడం వల్లనే తాను, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు బిజెపిలో చేరారని అంటున్నారు. అయితే తమను మోసగించి.. భారాసతో భాజపా అవగాహన పెట్టుకున్నారని, మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. అందుకే ఈ నాయకులు తిరిగి కాంగ్రెసులోకి వెళ్లిపోయినట్లుగా చెప్పారు.

అంతా బాగానే ఉంది. కానీ.. విజయశాంతి లాంటి పబ్లిక్ కు బాగా తెలిసిన నాయకురాలిని తమ పార్టీలో చేర్చుకున్నందుకు కాంగ్రెసుకు ఎంతో కొంత ఉపయోగం ఉండాలి కద. ఆమె తనను తిట్టిన వాళ్లను కౌంటర్లు మాత్రం ఇచ్చుకుంటూ.. అది కూడా ఎక్స్ వేదిక తప్ప బయటకు రాకుండా గడిపేస్తే పార్టీకి ఒనగూరే లాభం ఏమిటి? అనేది ఇక్కడ కీలక చర్చ. 

విజయశాంతిని స్టార్ క్యాంపెయినర్ తీరులో రాష్ట్రమంతా ముమ్మరంగా తిప్పుతూ.. ఆమెతో ఎన్నికలప్రచారం చేయిస్తే ఎంతో కొంత లబ్ధి ఉంటుంది కదా అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయకుండా, పార్టీ విజయానికి పాటుపడకుండా.. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తనకు టికెట్ కావాలని విజయశాంతి ఎలా ఆశించగలదని కూడా అంటున్నారు. 

ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇంకా పదిరోజుల గడువుంది. ఈలోగా.. రాములమ్మ సుడిగాలి పర్యటనలు, సభల ద్వారా.. కేసీఆర్ సర్కారు తీరుమీద విరుచుకుపడుతుందేమో చూడాలి.